ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందు రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీకి ఎదురైన సంక‌ట ప‌రిస్థితి ఇప్పుడు ఎన్నిక‌లు నాలుగేళ్లు ఉండ‌గానే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి ఎదురవుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే, గ‌తంలో వైసీపీకి ఎదురైన ప‌రిస్థితిని త‌ట్టుకుని పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ అధినేత జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి, సుదీర్ఘ పాద‌యాత్ర‌ను ఎంచుకుని స‌క్సెస్ అయ్యారు. క‌కావిక‌లం అయిపోయిన నాయ‌కుల‌ను మ‌ళ్లీ చేర‌దీసుకున్నారు. ప్ర‌జా బ‌లాన్నిసంపాయించుకున్నారు. ప్ర‌జ‌ల‌తో జై కొట్టించుకున్నారు. అధికారంలోకి వ‌చ్చారు. ఎన్నిక‌ల‌కు యేడాది ముందు జ‌గ‌న్ ఎంత తీవ్రంగా దెబ్బ తిన్నారో.. అంతే వేగంగా పుంజుకున్నారు. అయితే, ఇప్పుడు గ‌తంలో వైసీపీకి ఎదురైన ప‌రిస్థితే టీడీపీకి ఎదుర‌వుతోంది.

 

పైగా గ‌తంలో టీడీపీ ఏరికోరి వైసీపీ నాయ‌కుల‌కు వ‌ల విసిరింది. జిల్లాల‌కు జిల్లాల్లోనే నాయ‌కుల‌ను ఖాళీ చేయించే ప‌నిని ప్ర‌తి ష్టాత్మ‌కంగా తీసుకుంది. కానీ, ఇప్పుడు వైసీపీ అలా చేయ‌డం లేదు. తాను పిల‌వ‌కుండానే అనేక మంది టీడీపీ నాయ‌కులు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. జిల్లాల‌కు జిల్లాల నుంచే నాయ‌కులు బ‌ల‌మైన నేత‌లు వైసీపీలో చేరేందుకు వ్యూహాత్మకంగా పావులు క‌దుపుతున్నారు. ఇప్ప‌టికే చాలా మంది నాయ‌కులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్ప‌టికీ ఇంకా క్యూలో ఉన్నారని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

 

బ‌య‌టి ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్నా.. ఇది నిజ‌మేన‌ని అనిపిస్తోంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొని పార్టీని నిల‌బెట్టుకోవ‌డం, వ‌చ్చే నాలుగేళ్ల త‌ర్వాత పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డం అనేది టీడీపీకి పెను స‌వాలుగానే ప‌రిణ‌మించ‌నుంద‌నేది వాస్త‌వం. గ‌తంలో వైసీపీకి ఎదురు దెబ్బ‌లు త‌గిలినా.. పార్టీ అధినేత జ‌గ‌న్ యువ నాయ‌కుడు కాబ‌ట్టి అలుపెర‌గ‌కుండా రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి త‌న స‌త్తా చాటుకున్నారు. అఖండ మెజారిటీని సాధించారు. అయితే, ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితి ఎదురైతే.. టీడీపీని ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు ఆ పార్టీ త‌ర‌ఫున ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు ఒక్క చంద్రబాబు మాత్ర‌మే క‌నిపిస్తున్నారు.

 

కానీ, ఆయ‌న వ‌య‌సు నాలుగేళ్ల‌త‌ర్వాత పాద‌యాత్ర చేయాల‌న్నా.. మ‌రే యాత్ర చేయాల‌న్నా స‌హ‌క‌రిస్తుందా?  అప్ప‌టికీ ప్ర‌జ‌లు బాబును విశ్వ‌సిస్తారా? అంటే.. ఇప్ప‌టికే బాబు పాల‌న‌ను ప్ర‌జ‌లు ఐదేళ్ల‌పాటు చూసిన నేప‌థ్యంలోను, ఎన్నిక‌ల నాటికి జ‌గ‌న్ పాల‌న‌ను కూడా ఐదేళ్లు చూసిన నేప‌థ్యంలోను చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు జై కొడ‌తారా? ఆయ‌న వ్యూహాలు స‌క్సెస్ అవుతాయా?  టీడీపీ పుంజుకుంటుందా? అనేవి మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌లుగానే మిగులుతున్నాయి. మ‌రి ఈ ప‌రిస్థితిని ముందుగానే అంచ‌నా వేసుకుని త‌న‌కు మారుగా కీల‌క‌మైన నాయ‌కుడిని బాబు రంగంలోకి దింపే ప్ర‌య‌త్నం చేస్తారా?  చూడాలి ఏం జ‌రుగుతుందో!!

మరింత సమాచారం తెలుసుకోండి: