జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో మెటీరియల్ కాంపొనెంట్ కింద వినియోగించకుండా మిగిలి ఉన్న రూ. 300 కోట్ల విలువైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రూ. 300 కోట్ల మెటీరియల్ కాంపొనెంట్ నిధులు సద్వినియోగం చేసుకోవాలంటే రానున్న మూడు నెలల్లో సుమారు రూ. 1000 కోట్లు విలువైన పనులు ప్రారంభించాల్సిందేనని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో 5వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం వివిధ శాఖల ఉన్నత స్థాయి యంత్రాంగంతో ఉపాధి హామీ పనుల ప్రగతి అంశంపై ఆయన మాట్లాడారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం,  విజయనగరం,  విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఇతర పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్  ,  వెటర్నరీ, ఫారెస్ట్ అధికారులు హాజరయ్యారు.

శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు 10% మ్యాచింగ్ గ్రాంట్ ను రద్దు చేసి 100% ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధుల నుంచే కన్వర్జేషన్ ను, ఇంకా ఆయా శాఖల ద్వారా పూర్తి పనులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ మంత్రి ప్రకటించారు. సిమెంట్ కంపెనీలకు అడ్వాన్సులు రూపంలో డబ్బులు చెల్లించి,  పనులు జరిగే చోటుకు సిమెంట్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని,  అలాగే మార్కెట్ రేట్ కంటే తక్కువకే రూ. 240కే సరఫరా చేస్తామన్నారు. ఉపాధి పనులకు స్థానిక నదుల నుంచి అవసరం మేరకు ఇసుకను  వినియోగించుకునేందుకు ఎంపీడీఓలకు త్వరలోనే తగు  ఆదేశాలు ఇస్తామన్నారు.

మంత్రివర్యులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కోరారు. జాతీయ స్థాయిలో ఉపాధి  పథకం నిర్వహణలో తాము మూడవ స్థానంలో ఉన్నామని,  ఇది ఎంతో గర్వ కారణమని చెప్పారు. జిల్లా కలెక్టర్ నివాస్, ఇతర అధికారులను ఈ సందర్భంగా ఆయన  అభినందించారు. సమీక్షలో  మంత్రి ధర్మాన కృష్ణదాస్ తో పాటు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, పిల్లి సుభాష్ చంద్రబోస్, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, విశ్వరూప్ ఉన్నారు. కలెక్టర్ జె.  నివాస్, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, వి కళావతి, డాక్టర్ సీదిరి అప్పలరాజు, గొర్లె కిరణ్కుమార్, డిఆర్డిఎ పిడి కళ్యాణ్ చక్రవర్తి, డ్వామా  ఏపీడి  వాసుదేవరావు, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఇ టి.  శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: