కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరులు వైసీపీ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 23వ తేదీన ఆది సోదరులు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ మంత్రి ఆది సోదరులు ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, మరో సమీప బంధువు తాతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నారు. రాజకీయాల్లో ఆది, ఆది సోదరులు మొదటినుండి ఒకే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. 
 
సోదరులు ఇద్దరూ వైసీపీ పార్టీలో చేరితే ఆదినారాయణ రెడ్డి ఏకాకి కానున్నారు. సీఎం జగన్ ఈ నెల 23వ తేదీ నుండి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. 23వ తేదీన జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె దగ్గర స్టీల్ ఫ్యాక్టరీకి సీఎం జగన్ భూమిపూజ చేయనున్నారు. ఇక్కడ జరగబోయే సభలో ఆది సోదరులు వైసీపీలో చేరనున్నారు. 
 
ప్రస్తుతం శివనాథ్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆది సోదరులు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయంగానే తెలుస్తోంది. శివనాథ్ రెడ్డి, నారాయణ రెడ్డి టీడీపీలో ఉన్నా టీడీపీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వీరు వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ తో ఇప్పటికే చర్చలు జరిపినట్టు సమాచారం. 
 
దాదాపు 30 సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉన్న ఆది సోదరులు రాజకీయంగా వేరు వేరు పార్టీల్లో ఉండబోతున్నారు. 2014 ముందు వరకు జగన్ అనుచరుడిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైసీపీ ప్రతిపక్షంలో ఉండటంతో ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరారు. ఆది సోదరులు కూడా టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా 23వ తేదీన వైసీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: