ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎక్కువ చర్చ చేసుకుంటున్న టాపిక్ ఏదైనా ఉందంటే అది...మూడు రాజధానుల కాన్సెప్ట్ గురించే. ఇది ఎలా సాధ్యపడుతుంది. సాధ్యమైతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయని రాష్ట్ర ప్రజలు చర్చల్లో మునిగితేలుతున్నారు. ఇక ఇందులో రాయలసీమ వాసులు కర్నూలుని జ్యూడిషయల్ క్యాపిటల్ చేయడాన్ని స్వాగతిస్తుంటే, అమరావతి చుట్టూ పక్కల ఉన్న కోస్తా జిల్లాలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అటు విశాఖపట్నంలో  ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టే నిర్ణయంపై ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే...అసలు ఒప్పుకునే సమస్యే లేదని అమరావతికు ఆనుకుని ఉన్న జిల్లా ప్రజలు అంటున్నారు.

 

ఇలా మొత్తం మీద చూసుకుంటే జగన్ సరికొత్త నిర్ణయం పట్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసులు సంతోషంగానే ఉన్నారు. ఇంకా చెప్పుకోవాలంటే అటు సీమకు దగ్గరున్న నెల్లూరు, ఇటు విశాఖకు దగ్గరున్న తూర్పు గోదావరి జిల్లా వాళ్ళు కూడా సంతృప్తిగానే ఉన్నారు. ఇక ఇటు వస్తే అమరావతికు అటు ఇటు ఉన్న ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల వాసులు మాత్రం జగన్ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లా వాసులు అయితే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

 

ఇప్పటికే ఈ రెండు జిల్లాలో ఉన్న ప్రతిపక్ష నేతలు ఆందోళన బాట పట్టగా....అటు రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు దీక్షలు, ధర్నాలతో రోడ్లపైకి వచ్చేశారు.అయితే ఈ రెండు జిల్లాలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం వల్ల...ఈ జిల్లాల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. తమకు మద్ధతుగా ఉండకపోతే వారిని నిలదీసే అవకాశముంది. ముఖ్యంగా రాజధాని రైతులు ఈ జిల్లాల మంత్రులపై ఫైర్ అవుతున్నారు. 

 

జగన్ అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కృష్ణా, గుంటూరు మంత్రులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు లాంటి వారైతే ఇదే ఫైనల్ నిర్ణయం కాదని ప్రజలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తుది నిర్ణయం వచ్చేవరకు ఓపికగా ఉండాలని అంటున్నారు. అయితే తుది నిర్ణయం వచ్చే లోపే ఆందోళనలు పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. దీని వల్ల ఈ రెండు జిల్లాల వైసీపీ నేతలకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: