తెలంగాణ ఆర్టీసిలో ప్రభుత్వం పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఆర్టీసిని లాభాల బాట పట్టించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా ఆర్టీసిని పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా 1000 బస్సులను కార్గో సేవలకు వినియోగించనున్నారు. దీని ద్వారా సరుకు రవాణాను చేస్తారు. అయితే రవాణాకు అనుగుణంగా ఇప్పటికే బస్సుల డిజైన్ మార్చి సిద్దం చేస్తున్నారు. ఈ నెల 23న తొలి బస్సు సిద్దం కానుంది. వీటిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించి ఓకే చెప్పగానే మిగిలిన బస్సులను సిద్దం చేయనున్నారు. 

 

అయితే కార్గో బస్సులకు ఎర్ర రంగును వాడనున్నారు. గతంలో బస్సులన్ని కూడా ఎరుపు రంగులోనే ఉండేవి. వైఎస్ సీఎం అయ్యాక బస్సులను ఆకుపచ్చ రంగులోకి మార్చారు. పలు సర్వీసుల బస్సుల రంగు కూడా మార్చారు. ప్రస్తుతం సరుకులు రవాణా చేసే వాహనాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎరుపు రంగు వాడుతున్నారు. అందుకే కార్గో సేవలు అందించే బస్సులకు కూడా ఎరుపు రంగు వాడాలని నిర్ణయించారు. ఒక్కో బస్సు 7 టన్నుల సామర్ధ్యం మోసేలా బస్సులను సిద్దం చేస్తున్నారు. 

 

సీఎం ప్రకటించిన హామీల అమలు తీరుపై కూడా మంత్రి సమీక్షించారు. ఇప్పటికే చాలా అంశాలను అమలు చేసినందున మిగతా వాటిని త్వరలో పూర్తి చేయాలని ఎండీ సునీల్‌శర్మను ఆదేశించారు. ఉద్యోగుల్లో సుహృద్భావ వాతావరణాన్ని తీసుకురావడానికి వన భోజనాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, గ్రేటర్‌ హైదరాబాద్‌ రీజియన్‌లో ఈ నెల 24న నిర్వహించనున్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సమావేశంలో ఈడీలు పురుషోత్తం, వినోద్, యాదగిరి, టి.వి.రావు, ఓఎస్డీ కృష్ణకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

 

పాత బస్సులను సరుకు రవాణా బస్సులుగా మారుస్తున్నారు. మంచి కండీషన్ లో ఉన్న బస్సులను ప్రయాణికుల కోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే కార్గో బస్సుల కోసం సిబ్బంది కేటాయింపు కూడా జరిగినట్టు సమాచారం. తొలి విడతలో 100 బస్సులు సిద్దం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో 2020 జనవరి 1న కార్గో సేవలు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎర్రబస్సుల రూపంలో కార్గో బస్సులు రానుండడంతో ప్రజలందరికి ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: