రాజ్య‌స‌భ స‌భ్యుల ప‌ద‌వీకాలం ముగియ‌నున్న నేప‌థ్యంలో టీఆర్ ఎస్‌లో కొత్త‌వారి ఎంపిక ఎలా ఉండ‌బోతోంద‌న్న చ‌ర్చ హాట్ టాపిక్‌గా మారింది. నిజామాబాద్ పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె క‌విత ఓట‌మిపాలైన విష‌యం తెలిసిందే. ఇప్పుడామెను రాజ్య‌స‌భ‌కు కేసీఆర్ పంపుతార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుండ‌గా..అదే స‌మ‌యంలో కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడైన బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ పేరు కూడా బ‌లంగా వినిపిస్తోంది. వినోద్‌కుమార్‌ను రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకుంటే మాత్రం క‌విత‌కు బెర్త్ క‌ష్ట‌మేన‌న్న వాద‌న టీఆర్ ఎస్ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

 

కేకే మ‌రియు సంతోష్‌కుమార్‌లు ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఉన్నారు. ఇద్ద‌రిలో సంతోష్‌కుమార్‌ను ప‌క్క‌న పెట్ట‌లేని ప‌రిస్థితి ఉంది. అదే స‌మ‌యంలో కేకేను మ‌ళ్లీ రాజ్య‌స‌భ‌కు పంపేలా రెన్యూవ‌ల్‌కు అనుగుణంగా కేసీఆర్ చ‌ర్య‌లు ఉంటాయ‌న్న అన్న‌ది కూడా సందిగ్ధంగా మారింది. కేకేను ప‌క్క‌న పెడితే వినోద్‌కుమార్ గాని క‌విత‌కు గాని ఛాన్స్ ద‌క్కే అవ‌కాశం ఉంది. అయితే ఇప్ప‌టికే సంతోష్‌కుమార్ కేసీఆర్ కుటుంబ‌స‌భ్యుల నుంచి ప‌ద‌విలో కొన‌సాగుతున్నారు.

 

మ‌ళ్లీ క‌విత‌కే ఛాన్స్ ఇస్తే విమ‌ర్శ‌లు వెల్లువెత్తడం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అలా కాని ప‌క్షంలో అదే సామాజిక‌వ‌ర్గం నుంచి వినోద్‌కుమార్‌కు అవ‌కాశం ద‌క్కుతుంది. అలా చేస్తే క‌విత‌కు అవ‌కాశం లేన‌ట్లేన‌ని చెబుతున్నారు. కవితను పెద్దల సభకు పంపడం వల్ల విమర్శలు రావొచ్చని ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నార‌ట‌. పైగా వినోద్‌కుమార్ లాంటినేత రాజ్య‌స‌భ‌లో ఉండ‌టం వ‌ల్ల కేంద్రం నుంచి వ‌చ్చే నిధుల‌పై రాజ్య‌స‌భ‌లో నిల‌దీసే అవ‌కాశం ఉంటుంద‌ని యోచిస్తున్నార‌ట‌.

 

మొత్తానికి రాజ్యసభ రేసులో కవితకు టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ నుంచి గట్టి పోటీ ఎదుర‌య్యేట్టే క‌న‌బడుతోంది. ఇప్పుడు క‌విత‌కు రాజ‌కీయ స‌ర్దుబాటు కేసీఆర్కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌నే అభిప్రాయం టీఆర్ ఎస్ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: