ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికే లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ సూచనల మేరకు రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం జనవరి నెలలో టెట్, డీఎస్సీలకు వేరువేరుగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అధికారులు 12 వేల నుండి 15 వేల వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. 
 
టీచర్ పోస్టుల భర్తీకి ముందుగా టెట్ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. విద్యాశాఖ గతంలో టెట్, టీఆర్టీని కలిపి టెట్ కమ్ టీఆర్టీ పరీక్షగా నిర్వహించింది. కానీ ఈ రెండు పరీక్షలను వేరువేరుగా నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నట్టు సమాచారం. 
 
ఏపీలో 2020 సంవత్సరం జూన్ నెల నుండి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నందున టెట్, డీఎస్సీలలో ఆంగ్ల మాధ్యమంలో అభ్యర్థులకు నైపుణ్యం ఉండేలా సంబంధిత అంశాలపై ప్రశ్నలు ఉండబోతున్నాయని సమాచారం. ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి కావటంతో ఆంగ్ల నైపుణ్యాలను పరిశీలించేందుకు ఒక ప్రత్యేకమైన పేపర్ ను పెట్టనున్నారని తెలుస్తోంది. డీఎస్సీలో అన్ని కేటగిరీల పోస్టులకు ప్రత్యేక పేపర్ ఉంటుందని సమాచారం. 
 
టెట్ పరీక్షలో కూడా ఇప్పుడు అడుగుతున్న అంశాలకు అదనంగా మరికొన్ని అంశాలను చేర్చబోతున్నట్టు సమాచారం. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 18,000 మందికి పైగా పదోన్నతులు కల్పించింది. 10,000 మంది పై స్థానాలకు వెళ్లడం వలన కింది స్థాయిలో ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి. గతంలో నిర్వహించిన టెట్ పరీక్షలో అర్హత సాధించలేని అభ్యర్థులు ప్రస్తుతం టెట్ నోటిఫికేషన్ పై దృష్టి సారించారు. టెట్, డీఎస్సీలకు వేరువేరుగా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుండి హర్షం వ్యక్తం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: