తెలంగాణ- మ‌హారాష్ట్ర స‌రిహద్దుల్లోని గోదావ‌రి నుంచి ద‌క్షిణాన హైద‌రాబాద్, చిట్యాల‌, షామీర్‌పేట వ‌ర‌కు నీళ్లొచ్చేలా ఈ కొత్త‌ డిజైన్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన నుంచి సీఎం కేసీఆర్ దీక్షతో చేసిన కృషిని, ఒక ఇంజనీర్ కంటే ఎక్కువగా, గూగుల్ ఎర్త్ సాఫ్ట్ వేర్ ని, కేంద్ర జలసంఘం వారి గోదావరి ప్రవాహ లెక్కలను ఉపయోగించి చేసిన పరిశోధనల్నింటినీ పరిశీలిస్తే ఆడో ఘన చరిత్రగా పేర్కొనవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్ల రికార్డు సమయంలోనే రైతాంగానికి నీటిని సరఫరా చేసే దశకు చేరుకున్న నిర్మాణ ఘట్టాలన్నింటినీ ఒక దగ్గర చేర్చి చరిత్రకు అందించడం హర్షణీయం. ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్‌లో ప్ర‌తిపాదించిన ప్రాణ‌హిత - చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్ర‌భుత్వం రీడిజైన్ చేయించింది.   

ముందుగా అనుకున్న‌ట్టు ప్రాణ‌హిత న‌దిపై కాకుండా కాస్త కింద‌కు, ప్రాణ‌హిత న‌ది గోదావ‌రిలో క‌లిసిన త‌రువాత‌ ప్ర‌ధాన నిర్మాణం సాగేలా రీడిజైన్ చేశారు. ఒక బ్యారేజీలా కాకుండా 3 బ్యారేజీలు, 19 పంపు హౌజులు, వంద‌ల కిలోమీట‌ర్ల కాలువ‌లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా 13 జిల్లాల్లోని 18 ల‌క్ష‌ల 25 వేల ఎక‌రాల‌కు కొత్త‌గా నీరిస్తారని అధికారులు చెబుతున్నారు. దారి పొడ‌వునా ఉండే గ్రామాల‌కు, హైద‌రాబాద్‌కు తాగునీరు, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు నీరు ఇవ్వాలనీ ప్రణాళిక రూపొందించారు.


కాళేశ్వరం ప్రాజెక్టు ఒక‌టి కాదు. ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువ‌లు, సొరంగాల‌ స‌మాహారం. కానీ, అన్నీ ఒక‌దానితో ఒక‌టి సంబంధం ఉన్న‌వే. గోదావ‌రి నీటిని వీలైనంత ఎక్కువ‌గా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇటీవల ప్రగతిభవన్ లో సీఎం ఓఎస్డీ (నీటిపారుదల శాఖ) శ్రీధర్ రావు దేశ్ పాండే రాసిన కాళేశ్వరం ప్రాజెక్టు – తెలంగాణ ప్రగతి రథం పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ పుస్తకా విష్కరణ కార్యక్రమంలో కవి, రచయిత జూలూరి గౌరీశంకర్, కాళేశ్వరం ఈ.ఎన్.సి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర సమాచారాన్ని, చరిత్రను అందించాలన్న సంకల్పంతోనే సమగ్ర గ్రంథాన్ని రాశారని రచయిత దేశ్ పాండేను అభినందించారు.

వాస్తవానికి కొత్త ఆయ‌కట్టు కాకుండా శ్రీరాంసాగ‌ర్, నిజాం సాగర్, మిడ్ మానేరు, లోయ‌ర్ మానేరు, అప్ప‌ర్ మానేరు ప్రాజెక్టుల‌ను కూడా ఈ ప్రాజెక్టుతో అనుసంధానించ‌డానికి కొత్త‌గా కాలువ‌లు, సొరంగాలు, పంపు హౌజులు త‌వ్వారు. వీటి ద్వారా మిగిలిన నీటిని త‌ర‌లించి ఆయ‌క‌ట్టును స్థిరీక‌రిస్తారు. అంటే ఆ రిజ‌ర్వాయ‌ర్ల కింద ఉన్న 18.82 ల‌క్ష‌ల ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు నిక‌రంగా నీరందించ‌వ‌చ్చ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చెబుతోంది. వీటికి అద‌నంగా, పాత ప్రాణ‌హిత ప్రాజెక్టు ప్ర‌తిపాదించిన చోటే అప్ప‌టికంటే ఎత్తు త‌గ్గించి మ‌రో బ్యారేజీ నిర్మిస్తున్నారు. అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 2 ల‌క్ష‌ల ఎక‌రాలకు నీరిచ్చేలా దీన్ని రీడిజైన్ చేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: