కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు విషయంలో రాయలసీమ ప్రజలను వంచించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. రాయలసీమను వంచిస్తున్న జగన్‌ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? అంది తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.  వైఎస్ జగన్ కు రాయలసీమ విషయంలో కొన్ని రకాల ప్రశ్నలను సంధించారు. 

 

కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం గతంలో చంద్రబాబునాయుడు గారు రూ.2వేల కోట్లు కేటాయించగా.. జగన్‌ ప్రభుత్వం ఎందుకు 2వేల కోట్లు కేటాయించలేదు?  కడప స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రభుత్వమే ఎందుకు నిర్మించడం లేదు? గాలి జనార్థన్‌ రెడ్డికి కట్టబెట్టేందుకే తెరవెనుక నాటకం జరుగుతోందా?  రాయలసీమకు అన్యాయం చేస్తున్న విషయం వాస్తవం కాదా? గత ఏడాది ఒకసారి వరదలు వస్తేనే చంద్రబాబునాయుడు గారు అనంతపురంలో 150 చెరువులను కృష్ణా నీటితో నింపారు. ఇప్పుడు 8 సార్లు కృష్ణాకు వరదలు వచ్చినా 54 చెరువులనే నింపారు. ఇదేనా రాయలసీమను ఆదుకోవడం?

 

రిజర్వాయర్లను, చెరువులను పూర్తిస్థాయిలో నీటితో నింపకుండా నెపాన్ని కాలువల సామర్థ్యంపై మోపుతున్నారు. ఇవే కాలువల సామర్థ్యంతో చంద్రబాబునాయుడు గారు మీరు నిల్వచేసిన నీటికంటే ఎక్కువే నీటిని నిల్వ చేసింది వాస్తవం కాదా? పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 24 గంటలు మాత్రమే 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత ఎందుకు తగ్గించేశారు? పొరుగురాష్ట్రం మెహర్బానీ కోసమా? శ్రద్ధ లేకపోవడమా? ఇదేనా రాయలసీమను ఉద్ధరించడం?

 

గండికోట రిజర్వాయర్‌ ముంపు రైతులకు చంద్రబాబునాయుడు గారు రూ.700 కోట్ల పరిహారం ఇచ్చి ప్రాజెక్టును పూర్తిచేసి సాగునీరు ఇవ్వడం జరిగింది. చిత్రావతి రిజర్వాయర్‌ ముంపు రైతులకు రూ.50 కోట్లు కూడా ఇవ్వలేకపోయిన జగన్‌ రాయలసీమను ఉద్ధరిస్తారా?  రాయలసీమలో సోలార్‌, విండ్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా 13 వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించింది. సోలార్‌, విండ్‌ ప్రాజెక్టులను దెబ్బతీయడం అంటే రాయలసీమకు నష్టం చేయడం కాదా? అనంతపురం జిల్లాలో కియా అనుబంధ పరిశ్రమలను వెళ్లిపోయేలా దౌర్జన్యం చేయడం ద్రోహం కాదా?

 

చిత్తూరు జిల్లాలో మన్నవరం ప్రాజెక్టును కొనసాగించడానికి మీరు ఏం చేశారు? మీ తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కృష్ణా నదిలో మిగులు జలాలపై హక్కులు కోరబోమని బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు లేఖ ఇచ్చి రాయలసీమకు అన్యాయం చేసింది వాస్తవం కాదా?  రాయలసీమకు ఇన్ని అన్యాయాలు చేసి.. వాటిని కప్పిపెట్టుకోవడానికి మూడు ముక్కలు చేసిన హైకోర్టు ఇస్తామని చెప్పడం.. ఏడ్చేపిల్లవాడికి ఎలక్కాయ ఇచ్చినట్లు కాదా? రాయలసీమ ప్రజలను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. 

 

రాయలసీమను అభివృద్ధి చేసిన ఘనత అన్న ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు గారికే దక్కుతుంది. రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులను తీసుకువచ్చిన ఘనత టీడీపీది. టీడీపీ హయాంలో అనంతలో కియా పరిశ్రమ, సెంట్రల్‌ యూనివర్సిటీ, కర్నూలులో సోలార్‌, విండ్‌ ఎనర్జీ పరిశ్రమలు, రాయలసీమలో అనేక విద్యా సంస్థల ఏర్పాటుతో పాటు శ్రీసిటీలో వందలాది పరిశ్రమలు తీసుకువచ్చి లక్షలాది ఉద్యోగాలను కల్పించడం జరిగింది. చంద్రబాబునాయుడు గారు రాయలసీమలో అనేక సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులకు నీరు అందివ్వడం జరిగింది. రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని తగ్గించి శాంతిని నెలకొల్పడం జరిగింది. గండికోట, ముచ్చుమర్రి ప్రాజెక్టులను పూర్తిచేసి పులివెందులతో పాటు పుంగనూరు వరకు సాగునీటిని తీసుకెళ్లిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుంది. కర్నూలును విత్తన రాజధాని చేయాలి. ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించాలి. సాగునీటి పెండింగ్‌ ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలి. ఓర్వకల్లు పారిశ్రామిక వాడను, విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని టీడీపీ నాయకులు పట్టుబడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: