సాధారణంగా రాజ్‌భవన్ అంటే... ప్రజలకు కాస్త దూరమే.. ఎవరో పెద్ద పెద్ద నాయకులు తప్ప సాధారణ ప్రజలు గవర్నర్ ను కలవడం కష్టం. అయితే రాష్ట్ర పాలన అంతా గవర్నర్ పేరు పైనే జరుగుతుంటుంది. అలాంటి గవర్నర్ ను కలవడం ఇప్పుడు టెక్నాలజీ కారణంగా సులభంగా మారనుంది. 

 

ఎందుకంటే..ఏపీ లో గవర్నర్ రాజ్ భవన్ పేరిట వెబ్ సైట్ రూపొందించారు. ప్రజలకు రాజ్‌భవన్‌ను మరింత చేరువ చేసే క్రమంలో భాగంగా విభిన్న అంశాల కలయికగా కొత్తగా రూపొందించిన వెబ్ సైట్‌ను గవర్నర్‌ బిశ్వభూషణ్‌  హరిచందన్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. స్వయంగా ఈ వెబ్‌సైట్‌ను రాజ్ భవన్‌లో ఆవిష్కరించారు. 

 

రాజ్‌భవన్‌ ఐటీ విభాగం ఆధ్వర్యంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఈ వెబ్ సైట్ రూపొందించారు. వెబ్‌సైట్‌లోని ఇ-విజిటర్ సదుపాయం ద్వారా గవర్నర్‌ను కలవాలనుకునే సందర్శకుడు  ఆన్ లైన్‌లో తన వివరాలను నమోదు చేసుకుంటే, రాజ్ భవన్ వాటిని పరిశీలించిన తదుపరి, తగిన నిర్ధారణ అనంతరం నమోదుదారుకు  సమాచారం పంపుతుందని గవర్నర్‌కు కార్యదర్శి మీనా వివరించారు.

 

అలాగే ఇ-మెసేజ్ ద్వారా గవర్నర్ సందేశాన్ని పొందటానికి అభ్యర్థనలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని, ఇ-గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదులను సైతం సమర్పించవచ్చని తెలిపారు.  వెబ్‌సైట్‌లో గవర్నర్ ప్రసంగాలు, కార్యక్రమాలతో ఫోటో గ్యాలరీ వంటి ప్రత్యేక విభాగాలు కూడా ఉన్నాయి. రోజువారీ ప్రాతిపదికన రాజ్ భవన్ అధికారులు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తారు. 

 

వెబ్‌సైట్‌ను http://governor.ap.gov.in/  లేదా http://rajbhavan.ap.gov.in/  ద్వారా సందర్శించవచ్చని గవర్నర్‌ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని ఎప్పటి కప్పుడు అప్ డేట్ చేయాలని గవర్నర్ సూచించారు. రాజ్ భవన్ గౌరవాన్ని ఇనుమడింప చేసేలా వ్యవహరించాలని గవర్నర్‌ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి అర్జున రావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: