ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ విషయం పైనే చర్చ జరుగుతోంది. ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ మంత్రుల క్యాబినెట్ మీటింగ్ జరగనుంది, ఈ భేటీ ముగిసిన అనంతరం సీఎం జగన్ ఏపీకి రాజధాని విషయంపై కీలక నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. అయితే క్యాబినెట్ మీటింగ్ సాధారణంగా అమరావతిలో కానీ, విజయవాడలో కానీ నిర్వహిస్తారు ఇందుకు బిన్నంగా 27న జరిగే క్యాబినెట్ మీటింగ్ విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సౌతాఫ్రికా తరహాలో ఏపీకి మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని తన ఆలోచనగా ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పారు. అమరావతిలో చట్టసభలు, విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూల్ లో హైకోర్టు ఇలా అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకుంటూ వెళ్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. సీఎం జగన్ విశాఖను రాజధానిగా ప్రకటించడంతో సంబరాల్లో మునిగితేలారు ఆ జిల్లా ప్రజలు. ఇక విశాఖను పరిపాలన రాజధానిగా జగన్ ప్రకటించిన తరువాత ఏపీ రాజధానిపై ఏర్పాటు చేసిన జిఎన్ రావు కమిటీ కూడా ఏపీకి విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

ఈ నేపథ్యంలో విశాఖలో నిర్వహించే క్యాబినెట్ భేటీలో ఏపీకి మూడు రాజధానులు అని అధికారీకంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే విశాఖ ప్రజలకు విశాఖలోనే గిఫ్ట్ ఇచ్చిన వారవుతారు జగన్. ఎన్నో సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ప్రజల్లో తాము వెనుకబడి ఉన్నామన్న భావన ఉంది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజలకు సంతోషం కలిగించే అంశం. విశాఖలో రాజధాని ఏర్పాటు అయితే భీమిలి రాజధాని కేంద్రంగా ఉండొచ్చు అని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే అధికారులు గుట్టుచప్పుడు కాకుండా భూ సేకరణలో నిమగ్నమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. రాజధానిపై ఈ నెల 27న స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: