ఏపీ సీఎం జగన్ కు ఏపీ హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. జగన్ అధికారంలోకి రాగానే ముందుగా సచివాలయాలకు వైసీపీ రంగులు వేయడం ప్రారంభించారు. అయితే ఇది ఆరంభంలోనే వివాదాస్పదమైంది. గతంలో టీడీపీ ఇదే పని చేసినా ఇప్పుడు ఎల్లో మీడియా ఈ రంగుల వ్యవహారాన్ని బాగా హైలెట్ చేసింది.  అంతే కాదు..టీడీపీ నాయకుడొకరు ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్లారు.

 

ఇప్పుడు ఈ విషయంపై హైకోర్టు వైసీపీ సర్కారుకు అక్షింతలు వేసింది. ఏ రాజకీయ పార్టీకి చెందిన రంగునూ ప్రభుత్వ కార్యాలయాలకు వేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి... అధికార వైకాపా జెండా రంగులేయడాన్ని నిలువరించాలని కోరుతూ రైతు ముప్పు వెంకటేశ్వరరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులేయడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు.. అందుకు బాధ్యులెవరు, అనుమతులు ఎవరిచ్చారు, ఎంత ఖర్చు చేస్తున్నారనే వివరాలతో నివేదిక సమర్పించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది.

 

 

ఇప్పుడు ఆ కలెక్టర్ కోర్టుకు నివేదిక ఇచ్చారు. హైకోర్టుకు నివేదిక సమర్పించిన కలెక్టర్.... పంచాయతీ కార్యాలయాలకి రంగులు మార్చాలని పంచాయతీరాజ్  కమిషనర్ గిరిజాశంకర్ కలెక్టర్లందరికీ... ఆగస్టు 28న లేఖ పంపారని తెలిపారు. ఆ ప్రకారం గ్రామ సచివాలయాలకు పైనుంచి కిందకు... పచ్చ, తెలుపు, నీలి రంగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో పల్లపాడు గ్రామపంచాయతీ కార్యాలయానికి... రంగులేసే పనులు నిలిపేశామన్నారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన.. అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి పసుపు రంగు వేసినట్లుందన్నారు. అది తెలుగుదేశం జెండా రంగు అని తెలిపారు.

 

 

ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం తగదన్న హైకోర్టు... ఈ కేసులో ఏపీ ఎన్నికల సంఘాన్ని.. ప్రతివాదుల జాబితాలో చేర్చింది. రంగులు వేయడానికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. ఈ వ్యవహారం చూస్తే.. జగన్ కు హైకోర్టులో షాక్ తప్పేట్టు లేదుగా.

మరింత సమాచారం తెలుసుకోండి: