ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులను ప్రకటించిన తరువాత అమరావతిలో రైతులు ఆందోళనకు దిగారు.  రైతుల ఆందోళనతో రాజధాని ప్రాంతం మారుమ్రోగిపోతున్నది.  ఇప్పటికే రైతులు రోడ్లపైకి వచ్చి టెంట్ వేసుకొని కూర్చుకున్నారు.  నిరసనలు, వంటావార్పు కార్యక్రమాలు చేస్తున్నారు. రాజధాని అమరావతి నుంచి మార్చేందుకు వీలులేదని అంటున్నారు.  గత ఆరు రోజులుగా రాజధాని రైతులు ఆందోళనలు చేస్తున్న సమయంలో రైతులకు కొంతమంది నేతల నుంచి సపోర్ట్ దొరుకుతున్నది.  


చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున వెలగపూడిలో రైతులకు సంఘీభావం తెలిపాడు.  రైతులకు అండగా ఉంటామని అన్నారు.  గతంలో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం వచ్చిన తరువాత నెరవేరుస్తామని, ప్రస్తుతం వైకాపాపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని అంటున్నారు.  కేవలం అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు బిల్డింగ్ లతో అభివృద్ధి జరగదని, ఇండస్ట్రీస్ వస్తేనే అభివృద్ధి సాధ్యం అని అంటున్నారు.  


ఇదిలా ఉంటె, రాజధాని రైతులు చేస్తున్న ఆందోళన విషయంలో మంత్రి బొత్స స్పందించారు.  రైతులు ఆందోళన విరమించాలని సూచించారు.  అందరికి న్యాయం జరుగుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.  ప్రతి ఒక్కరికి జగన్ పాలనలో న్యాయం జరుగుతుందని అన్నారు.  రాష్ట్రంలోని 13 జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నది తమ లక్ష్యం అని, తప్పకుండా అభివృద్ధి చేసి తీరుతామని మంత్రి బొత్సా తెలిపారు.  


అమరావతిని ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తామని అన్నారు.  తెలుగుదేశం పార్టీ నేతలు రైతులను మోసం చేస్తోందని అన్నారు.  గత ఐదేళ్ళలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని, తెలుగుదేశం పార్టీ నేతలు అవినీతికి పాల్పడ్డారని అన్నారు.  అవినీతితో పాలనను తప్పుదోవ పట్టించారని అన్నారు.  తమది రైతు ప్రభుత్వం అని, రైతులకు ఇబ్బందులు రాకుండా చూడటమే తమ ప్రభుత్వం ధ్యేయం అని ఈ సందర్భంగా బొత్స తెలిపారు.  మరి బొత్సా హామీతో రైతులు ఆందోళనను విరమిస్తారా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: