మూడు రాజధానుల ప్రతిపాదనపై జరుగుతున్న ఆందోళనల నేపధ్యంలో వైసిపి ప్రజా ప్రతినిధులు సమావేశమవుతున్నారు.  రాజధాని గ్రామమైన తాడేపల్లి ప్రధాన కార్యాలయంలో ఎంఎల్ఏలందరూ సమావేశమవ్వటం కీలకమనే చెప్పాలి. ఎందుకంటే శుక్రవారం క్యాబినెట్ సమావేశం జరుగుతున్న నేపధ్యంలో ఒక్కరోజు ముందే ఎంఎల్ఏలందరూ సమావేశం అవ్వటమంటే మామూలు విషయం కాదు కదా ?

 

మొన్నటి అసెంబ్లీ సమావేశాల చివరి రోజున మూడు రాజధానులు ఉండచ్చంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదన ఎంతటి మంటలు మండిస్తున్నాయో అందరూ చూస్తున్నదే. జగన్ ప్రకటన చేసిన దగ్గర నుండి  రాజధాని అమరావతి ప్రాంతంలోని కొన్ని గ్రామాలకు చెందిన ఓ సెక్షన్ జనాలు మాత్రమే నానా గోల చేస్తున్నారు.

 

సరే ఇందులో స్ధానికులెవరు ? స్ధానికేతరులెవరు ?  అందులోకూడా వాళ్ళ సామాజికవర్గాలేమిటి ? అన్న విషయాలను పక్కనపెట్టేస్తే జగన్ ప్రకటనపై రాష్ట్రంలో మంటలు మండుతున్నాయని, అల్లకల్లోలం జరిగిపోతోందంటూ చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా విస్తృతంగా ప్రచారం చేస్తున్నది అయితే వాస్తవం.  జగన్ ప్రకటన చేసిన దగ్గర నుండి రాజధాని ప్రాంత నియోజకవర్గాలైన  మంగళగిరి, తాడికొండ ఎంఎల్ఏలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి మాత్రం జనాల్లో ఎక్కడా కనబడటం లేదన్నది వాస్తవం.

 

జగన్ ప్రకటనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న జనాలకు సమాధానాలు చెప్పుకోలేకే ఎంఎల్ఏలు మొహం చాటేస్తున్నారు. అయితే ఇలా ఎన్ని రోజులు తప్పించుకు తిరగాలి ? అన్నదే ఇపుడు వైసిపి ఎంఎల్ఏలు, నేతలను వేధిస్తున్న ప్రధాన ప్రశ్న. అందుకనే భవిష్యత్ కార్యక్రమంపై ఓ నిర్ణయం తీసుకోవటంలో భాగంగానే ఈరోజు సమావేశమవుతున్నారు.

 

టిడిపి నేతలు, ఆందోళనకారుల ప్రశ్నలకు ఎటువంటి కౌంటర్ ఇవ్వాలన్నదే ప్రధాన అజెండా అని సమాచారం. రైతులను ప్రసన్నం చేసుకోవటం ఎలా ? తన హయాంలో రైతులు, స్ధానికులను చంద్రబాబు ఎలా మోసం చేశాడనే విషయాలను వివరించి చెప్పాలనే విషయమై చర్చ జరగనున్నట్లు  తెలుస్తోంది. అమరావతి ప్రాంతాన్ని ఆదుకునేందుకు, అభివృద్ధి చేసేందుకు జగన్ దగ్గరున్న ప్లాన్లు ఏమిటనే విషయాన్ని కూడా ఎంఎల్ఏలు చర్చించనున్నారు. మొత్తానికి ఏదో ఓ గట్టి కౌంటర్ ను రెడీ చేసుకోవటమైతే ఖాయమని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: