అమరావతి ప్రాంతంలో ఉద్దండరాయునిపాలెంలో ఈరోజు  మీడియా ప్రతినిధులపై దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు మీడియా ప్రతినిధులకు గాయాలు అయ్యాయి. ఆ ప్రాంతంలో దీక్ష చేస్తున్న కొందరు ఈ దాడికి పాల్పడ్డారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా చిత్రీకరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. దాడి అనంతరం జగన్ మీడియా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి జరుగుతున్న సమయంలో  అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఈ రోజు ఉదయం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్షను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై ఈ దాడి జరిగింది.

 

 

దీంతో ఈదాడిని మీడియా సంఘాలు ఖండించాయి. రైతుల ముసుగులో కొందరు జర్నలిస్టులపై దాడి చేశారని ఆరోపించాయి. దీక్షా స్థలం వద్ద విధుల్లో ఉన్న మహిళా జర్నలిస్ట్ పట్ల కూడా కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. అక్కడే ఉన్న మరో మీడియా ప్రతినిధిపైనా దాడి జరిగింది. అయితే.. ఈదాడిని శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు కొందరు పన్నిన కుట్రగా  పోలీసులు అనుమానిస్తున్నారు. మీడియా ప్రతినిధుల పైనే కాకుండా అక్కడ విధుల్లో ఉన్న పోలీసులపై కూడా కొందరు దాడి చేసినట్టు తెలుస్తోంది. దీక్షను కవర్ చేయడానికి వచ్చిన మీడియా వాహనంపై కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేసారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

 

 

మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఓ వర్గం మీడియాను టార్గెట్ చేసే ఈ దాడి జరిగినట్టు భావిస్తున్నారు. అక్కడి కార్యక్రమం కవర్ చేయడం తప్ప మీడియా ప్రతినిధులు చేసేదేమీ ఉండదు. కానీ.. ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం తగదని మీడియా వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: