ఈరోజు ఉదయం 11 గంటలకు మొదలైన ఏపీ కేబినేట్ భేటీ ముగిసింది. రెండు గంటల పాటు ఈ సమావేశాలు జరిగాయి. కేబినేట్ భేటీలో ప్రధానంగా జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చ జరిగింది. కేబినేట్ సమావేశం ముగిసిన తరువాత మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. రాజధానిపై బీసీజీ నివేదిక రావాల్సి ఉందని నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని కన్నబాబు చెప్పారు. 
 
2020 సంవత్సరం జనవరి నెల 3వ తేదీన బీసీజీ నివేదిక వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వం బీసీజీ నివేదికను పూర్తిగా అధ్యయనం చేస్తుందని ఆ తరువాత మాత్రమే రాజధానికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పారు. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ తరువాత మాత్రమే మూడు రాజధానుల గురించి ప్రకటన చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. 
 
మరో మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కేబినేట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం రాజధాని విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను గుర్తించిందని అన్నారు. వాస్తవాలను మరచి గత ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంకల్పించిందని అన్నారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీ నివేదికలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిందని చెప్పారు. 
 
హైపవర్ కమిటీలో సీనియర్ ఐఏఎస్ అధికారులు, మంత్రులు ఉంటారని చెప్పారు. ప్రభుత్వం హైపవర్ కమిటీ సూచనలను బట్టి రాజధాని విషయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాజధానిపై సీఎం జగన్ ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్ని నాని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ గురించి చెబుతూ ఎక్కడ ఏది ఉండొచ్చు అని మాత్రమే చెప్పారని పేర్ని నాని అన్నారు. అందరికీ ఆమోద యోగ్యంగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని రాజధానిపై ప్రభుత్వం తరపున ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అమరావతి రైతులు, ఏపీ ప్రజలు ప్రభుత్వం నుండి రాజధాని గురించి ప్రకటన వస్తుందని భావించినా ఎవరూ ఊహించని విధంగా కేబినేట్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: