మాజీ సీఎం చంద్రబాబు అక్రమాలను ససాక్ష్యంగా బయటపెట్టేందుకు జగన్ పక్కా వ్యూహంతో వెళ్తున్నట్టే కనిపిస్తోంది. రాజధాని భూముల్లో అక్రమాలు ఉంటే చర్యలు తీసుకోండి అంటూ ఇటీవల చంద్రబాబు, లోకేశ్ సవాళ్లు విసురుతున్నారు. టీడీపీ నాయకులు, అమరావతి రైతులు కూడా ఇదే మాట అంటున్నారు. కానీ జగన్ సర్కారు ఈ విషయంపై ఏమీ తేల్చడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఇంకా చర్యలు తీసుకోరేంటి అని విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి.

 

అయితే ఈ విషయంలో జగన్ పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నట్టే కనిపిస్తోంది. రాజధాని భూముల కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తో సహా పలువురు మంత్రులు, నేతలకు సంబంధించిన పక్కా ఆధారాలు దొరికాయని మంత్రులే చెబుతున్నారు. అయితే అక్రమాలు నిజమే అయినా వాటిని నిరూపించేలా పక్కా వ్యూహంతోనే బయటపెట్టాలని జగన్ భావిస్తున్నారు. కొందరు నేతలు తమ కారు డ్రైవర్లు, తెల్లకార్డులు ఉన్నవారితో కాని భూములు కొనుగోలు చేయించారని సాక్షాత్తూ మంత్రి పేర్ని నాని చెప్పారు.

 

ప్రాదమికంగా వీటన్నిటిని గుర్తించడం జరిగిందని, లోకాయుక్తకు ఇవ్వడమా? లేక సిబిఐకి ఇవ్వడమా? లేక సిఐడి కి ఇవ్వడమా అన్నది న్యాయ నిపుణులతో మాట్లాడి నిర్ణయిస్తామని ఆయన అన్నారు. 2014 డిసెంబర్ కి ముందు భూములు కొనుగోలు చేశారని అభియోగాలు వచ్చాయని ఆయన అన్నారు. పలువురు నేతలు దమ్ముంటే భూముల కొనుగోలుపై విచారణ చేయాలని డిమాండ్ చేశారని, వారి కోరిక త్వరలోనే నెరవేరుతుందని ఆయన చెప్పారు. మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రి ఈ విషయాలు చెప్పారు.

 

అయితే ఆర్థిక నేరాలను నిరూపించడం అంత సులభం కాదు. భూకేటాయింపుల్లో అక్రమాలు నిజమే అయినా.. అవి న్యాయ సమీక్షకు నిలబడాలి. కోర్టుల్లో వాదనల్లో గెలవాలి. అందుకే ఆధారాల కోసం మరింత లోతుగా అధ్యయనం చేయించేందుకు జగన్ మొగ్గు చూపుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: