మూడు రాజధానుల అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన తర్వాత క్షేత్రస్ధాయిలో జరుగుతున్న గొడవలందరూ చూస్తున్నదే. మూడు రాజధానుల విషయంలో జగన్ చేసిన ప్రకటన తర్వాత ప్రకటనలోని లోపాలు మెల్లిగా  బయటకు వస్తున్నాయి. అసలు మూడు 0రాజధానుల ప్రకటనలోనే చాలా లోపాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పైగా జగన్ చేసిన ప్రకటన కూడా  రాంగ్ టైమ్ లో చేసినట్లే అనిపిస్తోంది. జగన్ ప్రకటన తర్వాత అమరావతి పరిధిలోని గ్రామాల్లో జరుగుతున్న గొడవలే  రాంగ్ టైం అని సూచిస్తున్నాయి.

 

ఇంతకీ విషయం ఏమిటంటే  రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించాలంటే మామూలు విషయం కాదు. రాజధాని విశాఖకు వస్తోందంటే యావత్ ఉత్తరాంధ్ర అంతా సంబరాలు చేసుకుంటున్నారు బాగానే ఉంది. కానీ మరి అమరావతి ప్రాంతంలోని జనాలు ఎందుకు ఒప్పుకుంటారు ? కాబట్టి ముందు అమరావతి ప్రాంతంలోని జనాలను తరలింపుకు అనుకూలంగా ఒప్పించాలి. జగన్ ఆపని చేయకుండానే  ఏకపక్షంగా తన ప్రతిపాదనను ప్రకటించేసరికి రాజధాని జనాలు భగ్గుముంటున్నారు.

 

అలాగే జీఎన్ రావు కమిటి రిపోర్టును క్యాబినెట్ లో పెట్టి రాజధాని తరలింపుపై నిర్ణయం తీసుకుంటామని మంత్రులు చెప్పారు. కానీ శుక్రవారం జరిగిన క్యాబినెట్ లో రాజధాని తరలింపుపై నిర్ణయం తీసుకోలేదు. ఇదే విషయమై బోస్టన్ అండ్ కన్సల్టెన్సీ గ్రూప్ (బిసిజి)నివేదిక వచ్చిన తర్వాతే నిర్ణయమని తీర్మానించారు. పైగా జిఎన్ రావు కమిటి నివేదికను బిసిజి నివేదికను కలిపి అధ్యయనం చేయటానికి హైపవర్ కమిటిని నియమించాలని డిసైడ్ చేసింది క్యాబినెట్.

 

అంటే హైపవర్ కమిటి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటే మూడు వారాలంటున్నారు కానీ ఇంకా ఎక్కువ సమయమే పట్టేట్లుంది. అంటే రాజధాని తరలింపుపై నిర్ణయం తీసుకోవాలంటే కనీసం జనవరి చివరి వారమైపోతుంది. మరి ఎప్పుడో తీసుకోబోయే నిర్ణయానికి ఇప్పటి నుండే కంపు చేసుకోవటం ఎందుకు ?

 

అలాగే హై కోర్టును కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. నిజానికి హైకోర్టును ఎక్కడ పెట్టాలనే విషయం జగన్ పరిధిలో లేదు. హై కోర్టు ఏర్పాటైనా తరలింపైనా సుప్రింకోర్టు కొలీజియం ఆమోదం ప్రకారమే జరగాలి. ఇపుడు అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు ఎందుకు తరలిస్తున్నారని కొలీజియం అడిగితే ఏమని సమాధానం చెబుతారు ? ఒకవేళ కొలీజియం అంగీకరించకపోతే అపుడేం చేస్తారు ? చూడబోతే పై అంశాల్లో జగన్ ముందస్తు కసరత్తు చేయలేదన్న విషయం అర్ధమైపోతోంది. అసెంబ్లీలో ప్రకటించిన విషయాల్లో ఏది జరగకపోయినా పోయేది జగన్ పరువే అన్న విషయం గుర్తుంచుకోవాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: