హిందూపురం ఎమ్మెల్యే , సినీహీరో నందమూరి బాలకృష్ణకు కొత్త చిక్కు వచ్చిపడింది . తన ఇద్దరు అల్లుళ్ళలో ఎవరి పక్షం వహించాలో తేల్చుకోలేక ఆయన సతమతమవుతున్నారు . బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ళు ఇటీవల జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు . ఇక ఇద్దరు తాము ఓడిపోయి , పార్టీ పరాజయం పాలయినప్పటికీ , రాజకీయాల్లో చురుకుగానే కొనసాగుతున్న విషయం తెల్సిందే . అయితే  బాలయ్య అల్లుళ్ళల్లో  ఒకరు రాష్ట్ర రాజధాని అమరావతి తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా , మరొక అల్లుడు మాత్రం విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనను  స్వాగతించడం హాట్ టాఫిక్ గా మారింది .

 

 బాలయ్య పెద్ద అల్లుడు , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  తనయుడు , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ , రైతులు , స్థానికులు చేస్తోన్న ఆందోళనలో పాల్గొంటున్నారు . ఇక బాలయ్య  చిన్న అల్లుడు శ్రీ భరత్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ లోక్ సభ స్థానం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు . అయితే శ్రీ భరత్ కూడా పార్టీ లైన్ కు భిన్నంగా ఇతర టీడీపీ నేతల మాదిరిగానే, విశాఖలో కార్య నిర్వాహక రాజధానిని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు .

 

 తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని శ్రీ భరత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టం అవుతున్నప్పటికీ , బాలయ్య కు మాత్రం మహా చెడ్డ ఇబ్బంది వచ్చి పడింది . ఇద్దరు అల్లుళ్ళలో ఎవరి స్టాండ్ తో తాను ఏకీభవించాలో తెలియని అయోమయ స్థితిలో ఆయన ఉన్నారు . రాయలసీమ నుంచి తాను ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఆయన శ్రీ భరత్ పక్షమే వహించాలి కానీ బాలయ్య ఏ అల్లునికి మద్దతునిస్తారన్నది ఆసక్తి కరంగా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి: