ఏపీ సర్కారు ఆంధ్రజ్యోతి పత్రికకు షాక్ ఇచ్చింది. జగన్ సర్కారుపై ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వ్యతిరేక ప్రచారం చేసేందుకు ఈ పత్రిక ముందుంటుందని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. ఈ పత్రిక కొన్నిరోజుల క్రితం.. టీటీడీ క్యాలండర్ లో యేసయ్య నినాదాలు ఉన్నాయంటూ కథనాలు ప్రచారం చేసింది. ఇది అప్పట్లో బాగా వివాదాస్పదమైంది. ఆ తర్వాత టీటీడీ ఈ వ్యవహారంపై విచారణ చేయించింది.

 

ఆ విచారణలో ఇది క్యాలండర్ లో కాదని.. గూగుల్ లింకులో యేసయ్య నినాదం కనిపించిందని.. అది టీటీడీ తప్పుకాదని గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారంలో తమ పరువుకు నష్టం కలిగించినందుకు ఆ పత్రికపైచర్య తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు శనివారం జరిగిన టీటీడీ పాలక మండలి మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తప్పుడు కథనాలు రాసినందుకు ఆంధ్రజ్యోతి పత్రికపై వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేయాలని టిటిడి బోర్డు సమావేశం నిర్ణయించింది.

 

ఈ మేరకు నిర్ణయం చేసినట్లు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. బోర్డు సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రమణ దీక్షితులను తిరిగి ప్రధాన అర్చకుడిగా నియమించాలని కూడా నిర్ణయించారు. వైకుంఠ ఏకాదశి నాడు సంప్రదాయబద్దంగానే కార్యక్రమం జరుగుతుందని అన్నారు ఏకాదశి, ద్వాదశి రోజులలో సామన్య ప్రజలకు పెద్ద పీట వేస్తామని ఆయన చెప్పారు. ముంబై, వారణాసి లలో స్వామి వారి ఆలయాలను నిర్మించాలని తీర్మానించారు. గొల్లమండపాన్ని తొలగించడం లేదని బోర్డు సభ్యుడు పార్ధసారధి చెప్పారు.

 

ఆంధ్రజ్యోతి పత్రిక వైసీపీ సర్కారుపై వ్యతిరేక వార్తలు రాయడం ఇదేం కొత్త కాదు. అనేక సార్లు ఆంధ్రజ్యోతి కథనాలపై వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ వ్యతిరేకించారు. ఏకంగా ఓ జీవో కూడా తీసుకొచ్చారు కూడా. మరి ఈ దావాపై ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఎలా స్పందింస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: