ఆత్మవిశ్వాసం  ఉండాలి కానీ అతివిశ్వాసం పనికిరాదని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు , టీఆరెస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు . త్వరలోనే జరగనున్న మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం లో పాల్గొన్న అయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాను అతివిశ్వాసానికి పోయే ఓడిపోయినట్లు చెప్పుకొచ్చారు . అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కంటే అధిక మెజార్టీ తో అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆరెస్ , లోక్ సభ ఎన్నికల్లోనూ 16 స్థానాలపై గురి పెట్టింది .

 

అయితే అనూహ్యంగా నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె  కవిత ,  కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ లు ఓటమి పాలుకావడం ఆ పార్టీ కి  గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి . టీఆరెస్ కు గట్టి పట్టున్న నిజామాబాద్ , కరీంనగర్ స్థానాలు కోల్పోవడాన్ని టీఆరెస్ పార్టీ నాయకత్వం కూడా జీర్ణించుకోలేకపోయింది . అసలు ఈ రెండు స్థానాల్లో టీఆరెస్ అభ్యర్థులపై బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడానికి గల కారణాలు ఏంటన్న దానిపై ఆరా తీశారు .  చివరకు ఈ రెండు స్థానాల్లో ఓటమి అభ్యర్థుల అతి విశ్వాసమే కారణమని పార్టీ నాయకత్వం తేల్చినట్లు తెలుస్తోంది . అదే విషయాన్ని వినోద్,  శనివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పార్టీ సన్నాహక సమావేశం లో వెల్లడించారు .

 

గెలుపుపై ధీమా ఉండడం తప్పులేదు కానీ అతివిశ్వాసానికి పొతే మొదటికే మోసం వస్తుందని వినోద్ హెచ్చరించారు . ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభించినప్పుడు తాము ఎంపీలు , మంత్రులు అవుతామని , కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఊహించలేదని వినోద్ చెప్పుకొచ్చారు . వచ్చే నెల జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా టీఆరెస్ నాయకత్వం పావులు కదుపుతోంది . పార్టీ అభ్యర్థుల ఎంపిక , ప్రచార బాధ్యతలను కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చూసుకుంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: