ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశంపై ప్రభుత్వానికి, విపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి పరిస్థితులు. మూడు రాజధానులపై ప్రభుత్వం ముందుకెళ్తుంటే.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న మహా ధర్నాకు విపక్షాలు మద్దతునిస్తున్నాయి. రైతుల దీక్షలు నేటితో 12 రోజులు పూర్తవుతున్నా ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారిలో ఉద్యోగులతో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు.

 

 

రెండు రాష్ట్రాలుగా విడిపోయాక.. ముఖ్యంగా పరిపాలన అంతా తెలంగాణ నుంచి అమరావతికి మార్చిన తర్వాత ప్రముఖ మీడియా సంస్థలన్నీ ఏపీకి సంబంధించి విజయవాడ కేంద్రంగా కొంత కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సీనియర్ జర్నలిస్టులను విజయవాడ తరలించి మీడియా వ్యవస్థను పటిష్టం చేశాయి. వారు కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరులకు మకాం మార్చుకున్నారు. కొన్ని చానెళ్లు విజయవాడ నుంచే పని చేస్తున్నాయి. దీంతో విజయవాడ కూడా మీడియా వ్యవస్థకు చిన్నపాటి కేంద్రంగా మారింది. ప్రస్తుతం మారిన పరిస్థితుల దృష్ట్యా మళ్లీ వారంతా డోలాయమానంలో పడుతున్నారు. విశాఖలో ఓ రాజధాని ఏర్పాటయ్యే పక్షంలో మళ్లీ విశాఖ వెళ్లాలా.. అనే సందిగ్ధంలో పడ్డారు.

 

 

అయితే.. ప్రస్తుతానికి మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం ఆలోచన మాత్రమే చేస్తూండగా దాదాపు ఖరారు అనే వార్తలు వస్తున్నాయి. అఫిషియల్ గా మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి తర్వాత ప్రభుత్వం అధికారికంగా రాజధానులను ప్రకటిస్తే విశాఖ కూడా మీడియాకు కేంద్రంగా చేయాల్సి వస్తుంది. ఇందుకు మరెంత మంది జర్నలిస్టులు సిద్ధపడతారో చూడాలి. ఇప్పటికే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన సీనియర్లలో కొంతమందిని విశాఖ వెళ్లమనే అవకాశం ఉంది. మరి.. మీడియా సంస్థల ఆలోచన మాటేమో కానీ.. ప్రస్తుతం వారంతా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: