వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజధానిలో జరుగుతున్న ఆందోళనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు ఫ్లాట్లు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారని వైసీపీ ప్రభుత్వం మాత్రం రైతులకు ఇళ్ల స్థలాలను ఇస్తోందని అన్నారు. చంద్రబాబు కమిటీ నివేదికలకు భిన్నంగా పచ్చని పొలాలను నాశనం చేశారని, గ్రామీణ వ్యవస్థను కూడా నాశనం చేశారని అన్నారు.
 
ఐదు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు రైతులెవ్వరికీ ఫ్లాట్లు ఇవ్వలేదని ఆ ఫ్లాట్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్ ఇవ్వబోతున్నాడని అన్నారు. వ్యవసాయం చేసుకుంటే భూములు వెనక్కు ఇస్తామని ఆ ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోందని బొత్స సత్యనారాయణ చెప్పారని ఆర్కే అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ అమరావతి రాజధానిగా వద్దని చెప్పిందని మూడు నుండి ఐదు పంటలు పండే ప్రాంతాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. 
 
చంద్రబాబు నాయుడు నాశనం చేసిన గ్రామీణ వ్యవస్థను, రైతు వ్యవస్థను నిలబెట్టటానికి కృషి చేస్తున్నామని అన్నారు. సీఎం జగన్ భూములిచ్చిన రైతులకు తగిన న్యాయం చేస్తాడని అన్నారు. చంద్రబాబు రైతులు ధర్నాల్లో పాల్గొనటానికి రావడం లేదని తెలిసి కృష్ణా జిల్లా నుండి, ఇతర జిల్లాల నుండి పార్టీ నాయకులను తెచ్చుకొని వారితో ధర్నా చేయిస్తున్నాడని ఆళ్ల రామకృష్ణా రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, చంద్రబాబు నాయుడు బినామీలు ధర్నాల్లో కూర్చుంటున్నారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇది ధర్మం కాదని ఇలాంటి రాజకీయాల పేరుతో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవద్దని ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. పది శాతం రైతులు మాత్రమే ఆందోళనల్లో పాల్గొంటున్నారని రాజధాని రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. కొన్ని రోజుల క్రితం రైతులు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కనిపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంటికి వినతిపత్రాలు అంటించిన విషయం తెలిసిందే. రాజధాని గురించి రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆర్కే ఈ వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: