జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత హేమంత్ సోరెన్ ఆదివారం రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ 11వ సీఎంగా హేమంత్ సోరెన్ గవర్నర్ ద్రౌపది ముర్ము సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీలలోని కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ బస్, ఆప్ నేత సంజయ్ సింగ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, డీఎంకే నేత స్టాలిన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. 
 
వీరితో పాటు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భాగల్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. గతంలో 2013 - 2014 లో హేమంత్ సోరెన్ సీఎంగా ఉన్నారు. గత ఐదేళ్లలో జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ - జేఎంఎం కూటమి ఘనవిజయం సాధించింది. 
 
గత ఐదేళ్లలో జార్ఖండ్ లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైంది. 81 అసెంబ్లీ స్థానాలు కలిగిన జార్ఖండ్ లో కాంగ్రెస్ -  జేఎంఎం ఆర్జేడీ కూటమి 47 స్థానాలలో విజయం సాధించగా బీజేపీ పార్టీ మాత్రం కేవలం 25 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమం రాంచీలోని మోరాబదీ మైదానంలో జరిగింది. ఇప్పటికే మంత్రి పదవులకు కీలక నేతలను ఎంపిక చేసినట్లు సమాచారం. 
 
మంత్రి పదవులు జేఎంఎం పార్టీ నుండి ఆరుగురికి, ఆర్జేడీ నుండి ఒకరికి, కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురికి ఖాయమైనట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ స్పీకర్ పదవి దక్కనుంది. ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి మోదీని 
ఆహ్వానించినా మోదీ సున్నితంగా రాలేనని తిరస్కరించినట్లు సమాచారం. జార్ఖండ్ కొత్త సీఎం హేమంత్ సోరెన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: