రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదన తెలుగు తమ్ముళ్ల లో మాదిరిగానే ,  కమలనాథుల్లో చీలిక తీసుకువచ్చిందా ? అంటే ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది . మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదన ను టీడీపీ తోపాటు  , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా వ్యతిరేకిస్తూ, మౌన దీక్షకు దిగిన విషయం తెల్సిందే . అమరావతిని శాసన రాజధానిగా , విశాఖను పరిపాలన రాజధానిగా , కర్నూల్ ను జ్యుడిషియల్ రాజధానిగా ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదన ద్వారా  టీడీపీ, బీజేపీ లకు కొత్తచిక్కు వచ్చిపడింది  .

 

ఆ రెండు పార్టీల నాయకులు ప్రాంతాలవారీగా చీలిపోయినట్లు స్పష్టం అవుతోంది . ఇప్పటికే ఉత్తరాంద్ర టీడీపీ నేతలు , పార్టీ లైన్ కు భిన్నంగా తమ ప్రాంత ప్రయోజనాలకు అనుగుణంగా స్పందించారు . ఇక విశాఖ ను రాజధానిగా వ్యతిరేకించడాన్ని సహించలేక  , టీడీపీ నగర అధ్యక్షడు రెహ్మాన్ ఆ పార్టీకి రాజీనామా చేసి , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాలని నిర్ణయించుకున్నారు . ఇప్పటి వరకు టీడీపీ ఎదుర్కొంటున్న ఇబ్బందే ... ఇప్పుడు బీజేపీకి కూడా వచ్చిపడినట్లు కన్పిస్తోంది . విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడాన్ని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్వాగతించారు .

 

రాజధానిగా విశాఖను ప్రకటిస్తే , దేశంలోని ఇతర నగరాలకు ధీటుగా అభివృద్ధి చెందుతుందన్న ఆయన , రాజధానికి కావాల్సిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయని చెప్పుకొచ్చారు . సాగునీటి ప్రాజెక్టుల్లో  రివర్స్ టెండరింగ్ ద్వారా సమకూర్చుకున్న ఆదాయం తో  విశాఖ లో పరిపాలన భవనాలను నిర్మించవచ్చునని విష్ణుకుమార్ రాజు సూచించారు . బీజేపీ అధ్యక్షుడు కన్నా ఒకవైపు మూడు  రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే , విష్ణుకుమార్ రాజు దానికి భిన్నంగా స్పందించడం హాట్ టాఫిక్ గా మారింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: