ఈఎస్ఐ స్కామ్ లో దేవికారాణి మెడకు ఈడీ ఉచ్చు బిగుస్తోంది. 200 కోట్ల రూపాయాల వ్యవహారం తేల్చటం కొరకు ఈడీ రంగంలోకి దిగింది. దేవికారాణిని ఈడీ ఈరోజు కస్టడీకి కోరనుంది. మందుల కుంభకోణంలో భారీగా ఆస్తులు కూడబెట్టిన దేవికారాణి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగితే దేవికారాణి అక్రమాస్తుల డొంక కదులుతోంది. దేవికారాణి అక్రమాస్తుల వ్యవహారంపై ఫోకస్ పెట్టిన ఈడీ ఈరోజు దేవికారాణిని కస్టడీకి కోరనుంది. 
 
ఈడీ అధికారులు మూడు రోజుల క్రితం మనీ ల్యాండరింగ్ కింద దేవికారాణిపై కేసులు నమోదు చేశారని సమాచారం. ఏసీబీ అధికారికంగా దాదాపు 200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తేల్చగా ఈ 200 కోట్ల రూపాయల గురించి ఈడీ దేవికారాణిని ప్రశ్నించనుంది. ఈడీ అధికారులు దేవికారాణిని కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మనీ ల్యాండరింగ్ కింద దేవికారాణి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టింది...? దేవికారాణికి సహకరించిన వ్యక్తులు ఎవరు..? అనే వివరాలను సేకరించేందుకు ఈడీ సిద్ధమైంది. 
 
మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద దేవికారాణిపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఐదేళ్ల కాలంలో ఐ.ఎం.ఎస్ ద్వారా దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగా అందులో దాదాపు 200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏసీబీ విచారణలో తెలిసింది. ప్రధానంగా దోచుకున్న డబ్బుతో బినామీ ఆస్తులను కూడబెట్టినట్టు తెలుస్తోంది. కార్మికశాఖలోని ఉన్నతాధికారులకు కూడా అవినీతి సొమ్మును పంచిపెట్టారనే ఆరోపణలు వచ్చినా అందుకు తగిన ఆధారాలు మాత్రం లభించలేదు. 
 
దేవికారాణి కోట్ల విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్లు గుర్తించినా ఆ ఆభరణాలను మాత్రం అధికారులు గుర్తించలేకపోయారు. ఒక పక్క ఏసీబీ దర్యాప్తు జరుపుతుండగానే అవినీతి డబ్బును ఎటువైపు మళ్లించారో తెలుసుకొని వాటి ద్వారా సమకూర్చుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో ఈడీ అధికారులు ఉన్నారని సమాచారం. అక్రమాస్తులను గుర్తించిన పక్షంలో ఆ ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: