ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తూతూమంత్రపు చర్య, ఉద్యోగుల కంటి తుడుపు చర్యగానే మిగులుతుందనేది స్పష్ట్టం. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావటం వల్ల ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పుకోవటానికి బాగుంటుంది కానీ, ఉద్యోగులకు ఆర్దికపరమైన లాభాన్ని వైసీపీ ప్రభుత్వం చేకూర్చదన్న ఆందోళన కార్మికుల్లో నెలకొంది. ఉద్యోగుల భవిష్యత్‌కు స్ధిరత్వం ఉంటుదన్న గ్యారెంటీ ఇస్తారా? ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు న్యాయపరంగా లభించాల్సిన ప్రయోజనం తప్పనిసరిగా చేకూర్చాలి. అధికారుల జీతాలు తగ్గిపోయే ప్రమాదం లేదా? ఆర్టీసి ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత పేరెగ్యులేషన్‌ కమిటీ ఏర్పాటు చేసి జగన్‌ తాను అనుకున్న ఉద్దేశ్యాన్ని ఆర్టీసీ ఉద్యోగులపై రుద్దే ప్రమాదం ఉంది. 

 

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజల నెత్తిన భారం మోపారు. ఆయన పాదయాత్రలో 65వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీనిచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత 60వేల మంది ఉద్యోగస్థులకు గాను కేవలం 54వేల మందిని మాత్రమే విలీనం చేస్తామని అంటున్నారు. కార్మికుల సంఖ్యను తగ్గించి మిగతా వారిని అగమ్యగోచరంలో పడేయటం ఏంటి? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం తొందరపాటు చర్య. దేశంలో ఏ రాష్ట్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయని స్ధితిలో ఏ ప్రామాణికాలను పాటిస్తున్నారో బహిర్గతం చేయాలి. ఈ పరిస్థితులన్నింటి మీద ఉద్యోగులకు, కార్మికులకు రాబోయే విపత్తులను పరిష్కరించి ముందుకెళ్తేనే ప్రయోజనం.

 

వైసీపీ ప్రభుత్వం.. అమలు చేస్తున్న ప్రతి ఒక్క పథకంలోను కోతలు పెడుతూ కేవలం కూతలకే పరిమితం అయ్యింది. జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విలీనం చేస్తున్నామని గొప్పలు చెబుతున్న నాయకులు వారికి పెన్షన్‌ విధానంపై స్పష్టత ఇవ్వటం లేదు. సీపీఎస్‌ విధానాన్ని 2004 తరువాత ఉద్యోగులుగా చేరిన వారికి అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కేవలం వారం రోజుల్లోనే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని ప్రగల్బాలు పలికి నేడు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ప్రజా రవాణా శాఖలో కలవనున్న ఆర్టీసీ ఉద్యోగులకు సీపీఎస్‌ అమలు చేయాలని యోచించడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని సదుపాయాలతో పాటు గతంలో ఆర్టీసీ అమలు చేసిన పరిమితిలేని వైద్య సేవలు కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీటన్నింటిపై స్పష్టత ఇవ్వకుండా కేవలం విలీనం పేరుతో రాజకీయ లబ్దిపొందేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: