తెలంగాణ లో తెలుగుదేశం పార్టీని చావు దెబ్బ కొట్టడంలో టీఆరెస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ సక్సెసయ్యారు . ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత , సీఎం జగన్మోహన్ రెడ్డి అదే పని చేయాలని పథక రచన చేస్తున్నారు .  తెలంగాణ లో టీడీపీ చావుదెబ్బ తినడానికి  ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊతమిస్తే , ఇప్పుడు మూడు రాజధానుల అంశం ...  ఏపీ టీడీపీ కి కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది .   తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆరెస్ అనుసరించిన ఎత్తుగడనే , ఇప్పుడు ఏపీ లో వైస్సార్ కాంగ్రెస్ అవలంభిస్తుంది .

 

 ఉత్తరాంద్ర లో రాజధాని ఏర్పాటుకు టీడీపీ నేతలు అనుకూలమా?, వ్యతిరేకమా ?? అన్న విషయాన్ని తేల్చి చెప్పాలంటూ వైస్సార్ కాంగ్రెస్ నేతలు , మంత్రులు కొత్తరాగాన్ని అందుకున్నారు . దీనితో ఉత్తరాంద్ర అభివృద్ధికి టీడీపీ వ్యతిరేకమన్న ప్రచారాన్ని ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్లాలన్నది వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ వ్యూహంగా కన్పిస్తోంది .   తెలంగాణ ఉద్యమ సమయం లో ప్రత్యేక  రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ పూర్తి వ్యతిరేకమన్న ప్రచారాన్ని ప్రజా బహుళ్యం లోకి తీసుకువెళ్లడం లో టీఆరెస్ విజయవంతమయిన విషయం తెల్సిందే  .

 

దాంతో  టీడీపీ ని తెలంగాణ వ్యతిరేక పార్టీగా  భావించిన ప్రజలు,   ఆ పార్టీ ప్రజాప్రతినిధులు , ముఖ్యనేతలను గ్రామాల్లో అడుగడుగునా అడ్డుకోవడంతో, వారు చేసేది లేక తమ  రాజకీయ భవిష్యత్తు  కోసం రాజకీయ జన్మనిచ్చిన పార్టీని వీడి, ఇతర పార్టీల్లో చేరారు .  తెలంగాణ ఉద్యమ సమయం లో టీఆరెస్ ఏదైతే ఎత్తుగడ వేసిందో , ఇప్పుడు వైస్సార్ కాంగ్రెస్ నాయకత్వం కూడా అదే వ్యూహం తో ముందడుగు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది . ఉత్తరాంధ్ర , రాయలసీమ అభివృద్ధి కి ఆ పార్టీ వ్యతిరేకమన్న భావన ప్రజల్లో కలిగించగలిగితే , ఇక ఏపీ లో ఆ పార్టీ కోలుకోవడమన్నది కష్టమేనని వైస్సార్ కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: