ప్రభుత్వం తక్షణ కర్తవ్యం ఏంటి.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం.. ఇదే ఇప్పుడు జగన్ సర్కారు అవలంబిస్తున్న విధానంగా కనిపిస్తోంది. అందుకే సీఎం జగన్ పాదయాత్రలో చెప్పినవి.. చెప్పనవి కూడా అమలు చేసుకుంటూ పోతున్నారు. కష్టాల్లో ఉన్నవారికి ఆదుకోవడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 

తాజాగా అలాంటి ఓ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నేతన్న కుటుంబాలకు అండగా నిలిచారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న సీఎం వైయస్‌ జగన్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నల కుటుంబాలకు పరిహారం అందించేందుకు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

 

అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు పరిహారం అందనుంది. ఇప్పటికే వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం కింద ప్రతి చేనేత కుటుంబానికి రూ. 24 వేల సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ కొత్త నిర్ణయం ద్వారా వేలాది చేనేత కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. ఇటీవలే చేనేత కుటుంబా లోకం జగన్ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.24,000 అందించాలని నిర్ణయించారు.

 

అనంతపురం జిల్లాలో నేత మగ్గం కార్మికులు 27,481 మంది ఎంపికయ్యారు. వీరితోపాటూ... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 81,783 మంది నేత మగ్గం కార్మికులంతా ఈ పథకం నుంచీ ప్రయోజనం పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.196.27 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఒక్కో మగ్గం నిర్వహణకు రూ.24 వేలు ఆర్థిక సాయం ఇస్తానని ప్రజా సంకల్ప యాత్రలోనే జగన్‌ ప్రకటించారు.

 

మరమగ్గాలు వచ్చాక చేనేతలకు ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. అప్పులు చేసి మరీ కుటుంబాల్ని పోషించుకుంటున్నారు. చాలా మగ్గాలు పాతవైపోయి... సరిగా పనిచెయ్యట్లేదు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో మగ్గాల్ని బాగు చేసుకోవడం, నూలు, రంగులు కొనేందుకు అవకాశం ఉంటుంది. వాస్తవానికి చేనేత అన్నది భారతీయులకు అనాదిగా వస్తున్న సంప్రదాయ వృత్తి. వస్త్రరంగంలో ఆధునిక యంత్రాలు, టెక్నాలజీ, వ్యాపార దిగ్గజాలు వచ్చాక.. ఈ చేనేత కుటుంబాల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. అయితే.. చేనేతల్లో ప్రజలు ఆదరణ పొందిన రకాలను ప్రత్యేకంగా గుర్తించి.. వాటిని రూపొందించడం.. యంత్రాలు ద్వారా రూపొందించలేని రకాలను అధ్యయనం చేయడం వంటి పద్దతుల ద్వారా చేనేతలతోనూ అద్భుతాలు చేయవచ్చంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: