కొత్త సంవత్సరం 2020 చారిత్రాత్మక సంవత్సరం కావాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. వీటి విజయవంతానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ విలీనంతో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోందన్నారు. 50వేల కార్మిక కుటుంబాల చిరకాల కోరికను నెరవేరుస్తున్నామని చెప్పారు. పేదలందరికీ ఉగాది నాటికి ఇళ్లపట్టాలు అందించనున్నట్టు తెలిపారు. ఇందుకు  ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పొద్దుట లేస్తే కలెక్టర్లు ఈ కార్యక్రమం గురించే ఆలోచించాలన్నారు. ఈ క్రమంలో భూముల గుర్తింపు, సేకరణకు వేగవంతమైన చర్యలు చేపట్టాలన్నారు. 

జనవరి 3 నుంచి ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని సీఎం జగన్ తెలిపారు. అదే రోజు ఆరోగ్యశ్రీ కింద 2059 రోగాలకు చికిత్స చేపడుతున్నామని చెప్పారు. దీనిని పశ్చిమ గోదావరిలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రభించనున్నట్టు తెలిపారు. 
మిగిలిన జిల్లాల్లో 1259 రోగాలకు పైలట్‌ ప్రాజెక్టుగా ఆరోగ్యశ్రీ పధకాన్ని అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఏప్రిల్‌ నుంచి అన్ని జిల్లాల్లో 2059 రోగాలకు ఆరోగ్యశ్రీ అమలవుతుందని చెప్పారు. ఫిబ్రవరి నుంచి క్యాన్సర్‌ వ్యాధికి ఆరోగ్యశ్రీ కింద పూర్తి చికిత్స అందించనున్నామన్నారు. ఎందులో భాగంగా 5వేల హెల్త్‌ సబ్‌ సెంటర్లకు జనవరిలోగా టెండర్లు ఖరారు చేయనున్నట్టు పేర్కొన్నారు. 
జనవరి 2న తుది జాబితా
రైతు భరోసా తుది విడత లబ్ధిదారుల జాబితాను జనవరి 2న విడుదల చేయనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. జనవరి 4,6,7,8 తేదీల్లో పాఠశాలల్లో విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పులపై చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో  జనవరి 9 న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తనువు చాలించిన రైతు కుటుంబాలను ఆదుకోవడంలో తాత్సారం వద్దంటూ స్పష్టమైన ఆదేశాలు చేశారు. 
2014 నుంచి 2019 జూన్‌ వరకూ ఆత్మహత్య చేసుకున్న 556 రైతు కుటుంబాలకు ఫిబ్రవరి 12న ఒకేసారి పరిహారం ఇవ్వాలని, ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టాలని చెప్పారు. 
వారికి గత ప్రభుత్వం ఇస్తామన్న రూ.5 లక్షలు ఎగ్గొట్టిందని విమర్శించారు. 2019 జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకూ బలవన్మరణానికి పాల్పడ్డ వారిలో చాలామందికి రూ. 7లక్షల డబ్బు అందలేదన్నారు. ఆ కుటుంబాలనే ఆదుకోవడంలో తాత్సారం జరిగిందని చెప్పారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. 

ఇసుక ఇకపై డోర్‌ డెలివరీ
దళారీ తనం, మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించేందుకు ఇక పై ఇసుకను డోర్ డెలివరీ చేయాలన్నారు. జనవరి 20 నుంచి అన్ని జిల్లాల్లో డోర్‌ డెలివరీ విధానం అమలవాలన్నారు. జనవరి 20 నాటికి అన్ని ఏర్పాట్లతో చెక్‌పోస్టులు అందుబాటులోకి రావాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహిళలు, చిన్నారాలపై దారుణాలకు పుల్‌ స్టాప్‌ పెట్టాలన్నారు. 
దిశ చట్టం అమలుకు అన్ని చర్యలూ తీసుకోవాలని చెప్పారు. వచ్చే నెలరోజులు ‘‘దిశ మంత్‌’’ గా పని చేయాలని సీఎం జగన్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: