నూతన సంవత్సరం రోజే జమ్మూ కశ్మీర్ పరిధిలోని పాక్ సరిహద్దులో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. రాజౌరీ జిల్లా నేషెరా సెక్టార్ లోని కలాల్ నియంత్రణ రేఖ వద్ద సైనిక జవాన్లు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో ఇద్దరు భారత జవాన్లు మరణించారు. ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ దేవేంద్ర ఆనంద్ ధ్రువీకరించారు.
 
ఈ కాల్పుల్లో ఎంతమంది ఉగ్రవాదులు మరణించారనే విషయం తెలియాల్సి ఉంది. ఉగ్రవాదుల కోసం జవాన్ల గాలింపు కొనసాగుతోంది. ఈరోజు ఉదయం సమయంలో ఈ కాల్పులు జరిగాయి.భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకోగా కాల్పుల్లో కొంతమంది జవాన్లు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. భారత బలగాలు నౌషెరా సెక్టార్ లో ఉగ్ర కదలికలపై సమాచారం అందటంతో కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. 
 
కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూన్న సమయంలోనే కాల్పులు జరగగా ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్న మనోజ్ ముకుంద్ నరవాణె ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే పొరుగుదేశం ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం మానని పక్షంలో ఉగ్ర మూలాలను దెబ్బ తీసే హక్కు భారత్ కు ఉందని అన్నారు. భారత భద్రత వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఉగ్రవాదం వంటి విషయాలపై మనోజ్ మాట్లాడారు. 
 
పాక్ తీరును మార్చుకోవాలని ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితులలోను సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానేయాలని సూచనలు చేశారు. తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో కూడా గతంలో ఎలా చేశామో అదే విధంగా సర్జికల్ స్ట్రైక్స్ కొనసాగిస్తామని అన్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజునే కాల్పులతో మొదలు కావటం గమనార్హం. నిన్న మనోజ్ ముకుంద్ నరగాణే గట్టి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: