ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి దాదాపు ఆరేళ్లు కావొస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ కావాలని అప్పటి టీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ క్రమంలో పుష్కర కాలానికిపైగా సాగిన ఆయన పోరాటంలో రోజుకోసారైనా ఆంధ్ర ప్రజలపైనా, రాజకీయ నాయకులపైనా ఆయన కోపం వెళ్లగక్కేవారు. రాష్ట్రం కోసం ఆయన ఆశయ సాధన కోసం ఆంధ్ర పాలకులను దూనమాడేవారు.

 

 

కొత్త సంవత్సరం సందర్భంగా ‘ఈచ్ వన్.. టీచ్ వన్’ అనే కొత్త పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అంత వరకూ బాగానే ఉన్నా.. తెలంగాణలో అక్షరాస్యత పెరగక పోవడానికి గత పాలకులే కారణం అని ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. అయతే.. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయన ఇంకా ఉమ్మడి రాష్ట్ర పాలనపైనా, పాలకులపైనా విమర్శలు చేయడమే కొంత ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణలో వంద శాతం అక్షరాస్యత సాధించాలనే ఆయన సంకల్ప బలం గొప్పదే అయినా.. ఇంకా గత పాలకుల పాలనపై వ్యాఖ్యలు ఎందుకనే మాటలు విన వస్తున్నాయి. సహజంగా రాజకీయ ప్రత్యర్ధుల తప్పులపై విమర్శలు చేయడం రాజకీయాల్లో సహజమే అయినా.. రాష్ట్రం విడిపోయాక ఆంధ్ర పాలకుల ప్రస్తావన ఎందుకనేది కొందరి అభిప్రాయం.

 

 

తన పట్టుదలతో అనుకున్నది సాధించారు కేసీఆర్. తెలంగాణ సాధించి ఎన్నికల్లో గెలిచి ఆ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నికై రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రపై ఆయన కోపం తగ్గిపోయింది. ఎప్పుడైనా ఆయనకు రాజకీయంగా అడ్డొస్తే మాత్రం ఇక్కడి పార్టీలపై, నాయకులపై మాత్రం ఆయన తిట్ల దండకం కొనసాగుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. ఓ మాటగా చెప్పాలంటే ఆయన ప్రత్యర్ధి రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తుంటే ఆసక్తికరంగా ఉంటుందనేది నిజం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: