టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కేబుల్ టీవీ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. టారిఫ్ భారాన్ని వినియోగదారులపై భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. న్యూ టారిఫ్ ఆర్డర్ కు ట్రాయ్ సవరణలు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ట్రాయ్ వెలువరించింది. ఉచిత ఛానెళ్ల విషయంలో కూడా ట్రాయ్ సవరణలు చేసింది. గతంలో 130 రూపాయలు చెల్లిస్తే 100 ఫ్రీ ఛానెళ్లు వచ్చేవి. ట్రాయ్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులలో ఆ సంఖ్యను 200కు పెంచింది. 
 
26 దూరదర్శన్ ఛానెళ్లను 200 ఛానెల్స్ తో పాటు కేబుల్ ఆపరేటర్లు తప్పనిసరిగా ఇవ్వాలని ట్రాయ్ ఆదేశాలను జారీ చేసింది. 200కు పైగా ఛానెళ్లు కావాల్సిన వినియోగదారులు 160 రూపాయలు చెల్లిస్తే అన్ని ఉచిత ఛానెళ్లు ఇవ్వాల్సిందేనని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. నెట్ వర్క్ కెపాసిటీ ఫీజును 130 రూపాయలుగా ఫిక్స్ చేసిన ట్రాయ్ ఛానల్ గరిష్ట ధరను మాత్రం 19 రూపాయల నుండి 12 రూపాయలకు తగ్గించింది. 
 
శ్లాబ్ సిస్టమ్ తో పాటు అలాకార్ట్ వెసులుబాటుకు కూడా ట్రాయ్ చెల్లుచీటీ ఇచ్చింది. కేబుల్ ఆపరేటర్ చెల్లింపుల విధానంలోను, బ్రాడ్ కాస్టింగ్ ఆపరేటర్ చెల్లింపుల విధానంలోను ట్రాయ్ భారీగా మార్పులు చేసింది. మార్చి 1వ తేదీ నుండి కొత్త టారిఫ్ ఆర్డర్ సవరణలు అమలులోకి రానున్నాయి. వినియోగదారులకు ట్రాయ్ కొత్త టారిఫ్ సవరణలతో భారీ ఊరట కలిగింది. 
 
కేబుల్ టీవీ వినియోగదారులు ఇకపై తక్కువ ఖర్చుతోనే ఫ్రీ టు ఎయిర్ ఛానెళ్లు చూసేలా ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. పెయిడ్ ఛానెళ్లు కూడా గతంతో పోలిస్తే భారీగా ధరలు తగ్గటం గమనార్హం. ఒకే ఇంట్లో రెండో టీవీ ఉంటే కొత్త నిబంధనల ప్రకారం నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు 40 శాతం చెల్లిస్తే సరిపోతుందని ట్రాయ్ పేర్కొంది. ఈ నెల చివరినాటికి కొత్త నిబంధనలను వెబ్ సైట్ లలో ఉంచాలని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారులు తక్కువ ఖర్చుతోనే ఇకనుండి ఫ్రీ టు ఎయిర్ ఛానెళ్లతో పాటు పెయిడ్ ఛానెళ్లను కూడా చూడవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: