ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ మూడు రాజధానులు ఉండొచ్చని ప్రకటన చేసిన రోజు నుండి చాలా మంది రాజకీయ నాయకులు కొత్తకొత్త డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ మూడు రాజధానుల గురించి సంక్రాంతి పండుగ తరువాత స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ నేత కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ తిక్కారెడ్డి వింత డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. 
 
టీడీపీ నేత తిక్కారెడ్డి మాకు విశాఖ రాజధానిగా వద్దు... కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు రాజధానిగా కావాలని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తిక్కారెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు కర్నూలు జిల్లా రాజధానిగా ఉండేదని ఆ తరువాత హైదరాబాద్... ఆ తరువాత అమరావతి... ఇప్పుడు విశాఖ అని సీఎం మారిన ప్రతిసారి రాజధానిని మార్చడం సరికాదని సంచనలన వ్యాఖ్యలు చేశారు. 
 
కర్నూలు పార్లమెంట్ ను కర్ణాటక రాష్ట్రంలో కలపాలని తిక్కారెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ వాసులు విశాఖను రాజధానిని చేస్తే ఇబ్బందులు పడతారని తిక్కారెడ్డి అన్నారు. 1956లో మంత్రాలయం నియోజకవర్గం బళ్లారి డివిజన్ లో ఉండేదని అందుకే కర్నూలు పార్లమెంట్ ను కర్ణాటకలో కలపాలని వింత డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. ప్రయాణానికి మంత్రాలయం నుండి విశాఖకు రెండు రోజుల సమయం పడుతుందని అన్నారు. 
 
కర్ణాటకలో కలపడం వలన విద్యకు, నీటికి ఎటువంటి ఢోకా ఉండదని తిక్కారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని మార్పు నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంటే తెలుగుదేశం పార్టీ విశాఖ నేతలు మాత్రం రాజధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇలాంటి సమయంలో కర్నూలు టీడీపీ నేత తిక్కారెడ్డి తెరపైకి తెచ్చిన వింత డిమాండ్ వలన చంద్రబాబుకు మరో సమస్య వచ్చినట్టే అని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: