పబ్జీ గేమ్.. ఈ అరాచక గేమ్ కు ఎన్ని జీవితాలు బలవుతున్నాయో వార్తల్లో చూస్తూనే ఉన్నాం. పబ్జి కోసం ఏకంగా ఇంట్లోవాళ్లను చంపిన ఘటనలు ఉన్నాయి. పబ్జి ఆడొద్దన్నందుకు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లూ ఉన్నారు. తాజాగా ఇలాంటి మరో ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ ఘటనలో మాత్రం పబ్జి గేమ్.. నిత్యం దైవారాధనలో ఉండే పూజారిని సైతం దొంగగా మార్చేసింది.

 

పబ్జి మాయలో పడిన ఆ పూజారి క్రమంగా దైవారాధన తగ్గించేసి పబ్జి ఆరాధాన ప్రారంభించాడు. ఆ తర్వాత జల్సాలకు అలవాటు పడి.. క్రమంగా దొంగ గా మారాడు. ఇంతకూ ఏం దొంగిలించే వాడో తెలుసా.. ఖరీదైన సైకిళ్లే ఇతని టార్గెట్. అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా.. 30కి పైగా సైకిళ్లు కొట్టేశాడు. సైకిల్ దొంగతనం చేయడం.. దాన్ని అమ్మేయడం ఆ సొమ్ముతో జల్సా చేయడం.. ఇదీ ఇతని దిన చర్యగా మారింది.

 

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన సిద్ధార్థ్ అనే 19 ఏళ్ల యువకుడు.. స్థానిక ఆలయలంలో ఉదయం వేళ పూజలు చేసేవాడు. అతడు క్రమంగా పబ్జీ గేమ్‌కు అలవాటు పడ్డాడు. నిత్యం అందులోనే మునిగిపోయేవాడు. దీంతో తల్లిదండ్రులు మందలించడం ప్రారంభించారు. ఈ గొడవలు పెరిగి పెద్దవి అయ్యాయి. అంతే.. ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మరి బతకడం ఎలా.. అందుకే దొంగతనాలకు అలవాటు పడ్డాడు.

 

ఖరీదైన సైకిళ్లు దొంగిలించడం ఈజీ అని అనుభవంతో తెలుసుకున్న సిద్ధార్థ వాటినే లక్ష్యంగా చేసుకునేవాడు. కుషాయిగూడ, నాచారం, నేరెడ్‌మెట్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో అనేక సైకిళ్లు మాయం చేశాడు. వాటిని అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. మౌలాలి పరిసర ప్రాంతాల్లో సైకిళ్ల దొంగతనాల కేసులు ఎక్కువగా వస్తుండటంతో.. పోలీసులు నిఘా పెట్టారు. సీసీ టీవీ ఫుటేజీలు చెక్ చేశారు. అలా మన సిద్ధార్ధ్ దొరికిపోయాడు. నిఘాతో అతడిని అరెస్టు చేసి కూపీ లాగితే మొత్తం 31 సైకిళ్లు దొంగతనం చేశానని ఒప్పుకున్నాడు సిద్ధార్ధ్.

మరింత సమాచారం తెలుసుకోండి: