హజీపూర్ వరుస హత్యల కేసులో తుది తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముగ్గురు బాలికలను పాశవికంగా, క్రూరంగా అత్యాచారం చేసిన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి కేసును ఈరోజు కోర్టు మరోసారి విచారణ చేయనుంది. పోలీసులు నిందితుడు శ్రీనివాస్ రెడ్డి కోర్టుకు హాజరు కానుండడంతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ మూడు నెలలుగా కొనసాగుతోంది.
 
ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 101మంది సాక్ష్యులను విచారించారు. పోలీసులు ఇప్పటికే పూర్తి నివేదికను కోర్టుకు సమర్పించారు. పోలీసులు కీలక సాక్ష్యాలను, సెల్ టవర్ లొకేషన్ ను, ఫోరెన్సిక్ నివేదికను కోర్టుకు అందజేశారు. పోలీసులు వేసిన కొన్ని ప్రశ్నలకు నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి సమాధానం చెప్పలేదు. గత నెల 26న విచారణ చేసిన కోర్టు విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. 
 
ఈరోజు కోర్టు చివరిసారిగా నిందితుడి అభిప్రాయాలను తీసుకోనుంది. ఈరోజు కోర్టు ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. కోర్టు శ్రీనివాస్ రెడ్డికి ఏ శిక్ష విధిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. హజీపూర్ గ్రామానికి చెందిన మనీష్, శ్రావణి, కల్పన అనే ముగ్గురు బాలికలను బైక్ లిఫ్ట్ ఇస్తానని చెప్పి శ్రీనివాస్ రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసి బావిలో బాలికల మృతదేహాలను పూడ్చిపెట్టాడు. 
 
న్యాయవాదులు, పోలీసులు ఈ కేసును పకడ్బందీగా దర్యాప్తు చేశారు. గ్రామస్థులు ఈ కేసులో నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేగంగా హజీపూర్ కేసును దర్యాప్తు చేయటంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కోర్టు ఎలాంటి తీర్పు చెబుతుందో అని గ్రామస్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత విచారణలో శ్రీనివాస్ రెడ్డి సాక్ష్యులు చెప్పేవన్నీ అబద్ధాలేనని అసలు ఈ కేసుతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: