న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ వాసుల‌కు `అధికారిక‌` గుర్తింపు ఖ‌రార‌య్యే తేదీ ఎప్పుడో తెలిసిపోయింది. గ‌త కొద్దికాలంగా హాట్ టాపిక్‌గా మారిన రాజ‌ధాని అంశంలో క్లారిటీ రానుంది. ఈ మేర‌కు రెండు కీల‌క తేదీల్లో ముఖ్య‌మైన నిర్ణ‌యాలు వెలువ‌డ‌నున్నాయి. ఏపీ రాజధాని ఏర్పాటుపై ప్రభుత్వం నియమించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఏపీ సీఎం జగన్‌కు తమ అధ్యయన నివేదిక సమర్పించింది. ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ని కలిసిన సంస్థ ప్రతినిధులు ఈ రిపోర్టును అందజేశారు. ప్రపంచంలోని వివిధ దేశాల బహుళ రాజధానులు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బహుళ రాజధానులు, బహుళ రాజధాని కార్యకలాపాల కేంద్రాలపై నివేదికలో ప్రస్తావించారు బోస్టన్ ప్రతినిధులు. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ అంశాన్ని తన నివేదికలో ప్రస్తావించిన బీసీజీ.. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలను స్పష్టంగా తెలియచేసిందని స‌మాచారం.

 

ఇప్ప‌టికే డిసెంబర్ 21న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ మధ్యంతర నివేదికను అందజేసింది. తాజాగా తుది నివేదికను స్ట్రాటజీ ఫర్ బ్యాలెన్స్ డ్ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్-బిగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్  పేరుతో బోస్టన్ రిపోర్ట్ అందించింది. ఇందులో ప్ర‌ధానంగా,  రాష్ట్రం సత్వరంగా ఆర్థికాభివృద్ధి సాధించాలంటే తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించారు. మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సత్వర ఫలితాల సాధనకు ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్న అంశాన్ని బీసీజీ నివేదికలో కూలంకషంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ, పర్యాటక, పరిశ్రమ, మత్స్య రంగాల అభివృద్ధిని నివేదిలో పేర్కొన్నారు.

 

ఇలా బోస్టన్ గ్రూప్ బాధ్య‌త పూర్త‌యిన నేప‌థ్యంలో....అంద‌రి చూపు ఏపీ స‌ర్కారు, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యంపై ప‌డింది. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ మూడు రాజధానులను సూచించింది. విశాఖలో సెక్రెటేరియట్, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు ఉండాలని సూచించింది. దాదాపుగా బీసీజీ సైతం ఇదే రీతిలో నివేదిక అందించింది. ఇప్ప‌టికే  ఈ రెండు కమిటీలు ఇచ్చిన నివేదికలను పరిశీలించి నివేదిక‌ ఇవ్వడానికి హై కమిటీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఆ హైపవర్ కమిటీ 6న సమావేశం కానుంది. ఈలోగా జనవరి 8వ తేదీన జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలోను బోస్టన్ గ్రూపు ఇచ్చిన నివేదికను ఎజెండాగా చేరుస్తారని స‌మాచారం. దీంతో...జ‌న‌వ‌రి 6, జ‌న‌వ‌రి 8వ తేదీలు ఏపీ విష‌యంలో కీల‌క‌మైన‌విగా ఉండ‌నున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: