అవును .. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నా.. పాకిస్తాన్ ఇండియాకు ఓ విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది. పాకిస్తాన్ జైల్లలో మగ్గిపోతున్న కొందరు భారత జాలర్లను విడుదల చేయబోతున్నామని ప్రకటించింది. పాకిస్తాన్‌ జైల్లో ఉన్న ఉత్తరాంధ్ర మత్స్యకారుల విడుదలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పొట్టకూటి కోసం సముద్రంలోకి వెళ్లి పాక్ సైన్యానికి దొరికిన జాలర్లు త్వరలోనే ఇండియాకు రాబోతున్నారు.

 

అసలేం జరిగిందంటే.. పొట్టకూటి కోసం గుజరాత్‌ వెళ్లిన మత్స్యకారులు పొరబాటున పాకిస్తాన్‌ జల భాగంలోకి ప్రవేశించడంతో పాక్‌ అధికారులు వారిని అరెస్టు చేశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు పాదయాత్ర సమయంలో వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకురావడంతో బాధితుల విడుదలకు కృషి చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర విదేశాంగపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అంతేకాకుండా బాధిత కుటుంబ సభ్యులను విదేశాంగ శాఖ వద్దకు తీసుకెళ్లి అనేక మార్లు చర్చలు జరిపించారు.

 

మత్స్యకారుల విడుదల కోసం ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కృషి ఫలించింది. విడుదలకు అంగీకారం తెలుపుతూ, మత్స్యకారుల జాబితాను భారత విదేశాంగ శాఖకు పాకిస్తాన్‌ పంపించింది. జనవరి 6వ తేదీన వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులుకు పాకిస్తాన్‌ అప్పగించనుంది. తెలుగు మత్స్యకారులను వాఘా సరిహద్దు వద్ద జనవరి 6న విడుదల చేసేందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం అంగీకారం తెలుపుతూ భారత విదేశాంగ శాఖకు సమాచారం పంపించింది.

 

ఈ వార్త తెలిసిన ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇన్నాళ్లూ పొరుగు దేశంలో ఎలా ఉన్నారో.. జైళ్లలో ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో అంటూ మధన పడిన కుటుంబ సభ్యులకు ఈ వార్తతో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయింది. ఇక వచ్చే సంక్రాంతిని వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: