ఆయన భారత దేశ రెండో ప్రధాన మంత్రి.. నెహ్రూ సుదీర్ఘకాలం ప్రధానిగా పని చేసి దేశానికి దారి చూపిన తర్వాత దేశ పగ్గాలు చేపట్టిన రెండో వ్యక్తి లాల్ బహుదూర్. నెహ్రూ మరణానంతరం భారత దేశపు రెండవ ప్రధాన మంత్రిగా 1964 జూన్ లో ప్రధానిగా పగ్గాలు అందుకున్నారు. పొట్టివాడైనా మహా గట్టివాడన్న పేరు సంపాదించుకున్నారు. 1964వ సంవత్సరం మే 27వ తేదీన నాటి ప్రధాని నెహ్రూ కన్ను మూశారు. ప్రధాని పదవి శాస్త్రి గారిని వరించింది.

 

ఆయన ప్రధాని అయిన తర్వాత ఏడాదితో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది. ఆయన ఇచ్చిన జై జవాన్- జై కిసాన్ నినాదం దేశమంతా మారుమోగింది. 22 రోజుల భారత పాకిస్తాన్ యుద్ధంలో విజయం సాధించి మరో శాస్త్రి ఘనతను సాధించారు. అదే సమయంలో చైనా దేశంతో తలెత్తిన రక్షణ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించారు. పాకిస్తాన్ యుద్ధం చేసినా ఆ తర్వాత శాంతి కోసం ప్రయత్నించారు. ఆనాటి పాకిస్తాన్ రాష్ట్రపతి మొహమ్మద్ ఆయుబ్ ఖాన్ తో కలసి శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్నారు.

 

అప్పట్లో ఉమ్మడి రష్యాలో ఉన్న తాష్కెంట్ ఈ ఒప్పందానికి వేదికైంది. 1966 జనవరీ 10వ తేదీన శాస్త్రి , ఖాన్ తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే ఆ మరుసటి రోజే శాస్త్రి తాష్కెంట్ లోనే ఆకస్మికంగా మరణించారు. ఇది గుండెపోటుగా చరిత్రలో ఉన్నా.. ఇప్పటికీ ఈ మరణంపై అనుమానాలు ఉన్నాయి. ఎప్పుడూ ఆరోగ్యంగా, ఉల్లాసంగా వుండే శాస్త్రి ఆకస్మికంగా ఉన్నపళంగా మృతి చెందడం మిస్టరీగా మారింది. ఆయనపై విష ప్రయోగం జరిగిందన్న వాదనలూ ఉన్నాయి.

 

ఏదేమైనా భారత దేశం ఒక ఆదర్శ మూర్తిని, మహా నేతను కోల్పోయింది. భరతమాత ఓ గొప్ప దేశ భక్తుడిని పోగొట్టుకుంది. తక్కువ కాలమే ప్రధానిగా ఉన్నా ఆయన భవిష్యత్ భారతంపై తనదైన ముద్ర వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: