రాజధానిని విశాఖకు తరలించడం పట్ల ఇప్పటి వరకు అమరావతి ప్రాంత రైతులు మాత్రమే ఆందోళనలు , నిరసనలు వ్యక్తం చేస్తుండగా , ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల వంతు వచ్చినట్లు కన్పిస్తోంది . గతం లో హైదరాబాద్ నుంచి అమరావతికి  ఆఘమేఘాల మీద తీసుకువచ్చారని , ఇప్పుడు విశాఖ వెళ్లిపొమ్మంటున్నారని సచివాలయ ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . రాజధాని మార్పు గురించి తమతో ఏ కమిటీ సంప్రదింపులు జరపలేదని అంటున్నారు .

 

ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారుస్తామంటే అందరి కంటే ఎక్కువ ఇబ్బంది పడేది ఉద్యోగులేనని చెప్పుకొచ్చారు . హైదరాబాద్ లో స్థిరపడిన వారిని , రాష్ట్ర విభజన అనంతరం  అమరావతిని రాజధానిగా పేర్కొంటూ , ఆగమేఘాల మీద తరలించారని గుర్తు చేశారు .   పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించే అవకాశం  ఉన్నప్పటికీ, కాదని  రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసుకుందామంటే సహకరించమని చెప్పుకొచ్చారు . రాష్ట్ర ప్రభుత్వ పిలుపుతో  హైదరాబాద్ ను వదిలి విజయవాడ , గుంటూరు ప్రాంతాల్లో ఇల్లు కొనుగోలు  చేయడమో , అద్దె తీసుకుని ఉండడం చేస్తున్నామన్నారు .

 

ఇక అమరావతి ప్రాంతంలోనే స్థిరపడవచ్చునని భావిస్తున్న తరుణం లో , ఇప్పుడు  రాజధాని తరలింపుకు  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఉద్యోగుల్లో ఆందోళనలు మొదలయ్యాయి . ఇప్పుడు విశాఖ కు వెళ్లి అక్కడ అద్దె ఇళ్లను వెతుక్కోవడమంటే అంత ఆషామాషీ వ్యవహారమేమి కాదని అంటున్నారు . ఇక అమరావతి ప్రాంతం లో స్థిరపడవచ్చునని ఇల్లు కొనుగోలు  చేసినవారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు . ఇప్పటికిప్పుడు ఇల్లు కొనేదెవరంటూ నిలదీస్తున్నారు .

 

లేకపోతే ఈ ఎం ఐ లు చెల్లించేది ఎలా అంటూ సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు . అయితే విశాఖను ఎగ్జి క్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం , ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తుండడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: