ప్రతిపక్షనేత చంద్రబాబు మరోసారి తన రాజకీయ విశ్వ రూపం చూపుతున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తెలుగు దేశం రచ్చ రచ్చ చేస్తోంది. ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ప్రయత్నిస్తోంది. బస్సు యాత్ర వంటి ప్రచారాల ద్వారా రాష్ట్రం మొత్తం ఈ అంశంపై చర్చించుకునేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి రాజధానిని కదిలిస్తున్నామంటే రాష్ట్రమంతా కదలాలి. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. అందుకే చంద్రబాబు నిరసనల పేరుతో హల్ చల్ చేస్తున్నారు. విజయవాడ రోడ్డుపై కూర్చునేందుకు కూడా వెనుకాడటం లేదు.

 

అయితే ఇంత చేస్తున్నా చంద్రబాబు మాత్రం ఒక్క మాట తన నోటి నుంచి రాకుండా జాగ్రత్తపడుతున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని చెబుతున్నా.. ఎక్కడా విశాఖను వ్యతిరేకిస్తున్నామని మాత్రం చెప్పకుండా జాగ్రత్త పడుతున్నారు. అమరావతి, విశాఖపట్నం, కర్నూలు మూడు ప్రాంతాల అభివృద్ధికి చంద్ర బాబు అనుకూలమా..? వ్యతిరేకమా..? విశాఖ రాజధానిగా ఆమోదిస్తున్నారా.. వ్యతిరేకిస్తున్నారా అని వైసీపీ నేతలు నిలదీస్తే మాత్రం సూటి జవాబు చెప్పే పరిస్థితుల్లో చంద్రబాబు లేరు.

 

అందుకే చంద్రబాబు వైఖరిని వైసీపీ నేతలు ఎండగడుతున్నారు. కమిటీల రిపోర్టులు తప్పుబడుతున్న చంద్రబాబు గతంలో రాజధాని ప్రాంతంలో శ్రీకృష్ణ కమిటీ, శివ రామకృష్ణన్‌ కమిటీ నివేదికలను పక్కనబెట్టి సొంత కమిటీలు వేసి తనకు అనుకూలంగా మల్చుకున్న తీరును గుర్తు చేస్తున్నారు. నారాయణ కమిటీతో రాజధాని ప్రాంతాన్ని సర్వనాశనం చేసి..రైతులను సర్వ నాశనం చేసింది చంద్రబాబే అని గుర్తు చేస్తున్నారు.

 

రాష్ట్రం విడిపోయేటప్పుడు పూర్తిగా సహకరించి.. ఇప్పుడు రాష్ట్రమంతా డెవలప్‌ చేస్తామంటే నా ఆస్తులు ఉన్నచోటే డెవలప్‌ చేయాలని చంద్రబాబు అంటున్నాడని మండిపడుతున్నారు వైసీపీ నాయకులు. ఏదో విధంగా పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని... ధర్నాలు, బందుల్లో టీడీపీ గూండాలు చొరవడి దాడులకు తెగబడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: