ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎన్నికల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో నేతలు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని కానీ గెలిచిన తరువాత మాత్రం అవినీతికి పాల్పడతారని అన్నారు. ప్రజలు ఓట్లను అమ్ముకుంటుంటుంటే నేతలు ఓట్లను కొనుక్కుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. మారాల్సింది ప్రజలు అని వ్యవస్థ కాదని వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
వెంకయ్య నాయుడు ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని ఆపేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాయకులు ఎన్నికలు ముందు ప్రతిదీ ఉచితం అని ప్రకటనలు చేస్తారని తీరా అధికారంలోకి వచ్చాక పథకాలను అమలు చేయలేమని చేతులెత్తేస్తారని అన్నారు. ఎన్నికల్లో గెలిచాక రాజకీయనాయకులు చేతులెత్తేస్తారని వెంకయ్య నాయుడు వ్యంగాస్త్రాలు సంధించారు. ఇప్పుడు నాయకులు కేవలం సభలకే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రతి ఇంటికి వచ్చి చూడలేదని వెంకయ్య నాయుడు అన్నారు. 
 
పార్టీలు సభలను పెట్టడానికి మూడు బి లు పాటిస్తున్నాయని అవి బిర్యానీ, బీరు, బేటా అని అన్నారు. మనీ పవర్ ఇన్ ఎలక్షన్స్ పై హైదరాబాద్ లో జరిగిన సదస్సులో వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఒకేసారి జరిగితే అభివృద్ధికి ఆటంకం ఉండదని వెంకయ్య నాయుడు అన్నారు. పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అన్నారు. సొంత ఖర్చులతో వాజ్ పేయి లాంటి మహనీయుల సభలకు వెళ్లేవాళ్లమని వెంకయ్యనాయుడు అన్నారు. 
 
ప్రభుత్వమే ఎన్నికల ఖర్చులను ఇవ్వాలనేది సరికాదని వెంకయ్య నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యం కొంతకాలంపాటు మనుగడ సాగించాలంటే ప్రజల్లో మార్పు రావడమే మార్గమని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు వెంకయ్య చేసిన కామెంట్లకు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం నేతల్లో మార్పు వస్తే ప్రజల్లో మార్పు వస్తుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: