‘సినిమా స్నేహితులను ఇస్తుంది.. రాజకీయం శత్రువుల్ని ఇస్తుంది’ అని మహేశ్ సినిమా సరిలేరు నీకెవ్వరూ.. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి చెప్పిన మాట. ఇప్పుడు ఆ మాటలు ఆయనకే బాగా తగులుతున్నాయి. చిరంజీవితో వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఏపీ రాజధాని అంశంలో చిరంజీవి స్పందించిన తీరుపై మండిపడ్డారు. సూపర్ స్టార్ మహేశ్, కమెడియన్ పృథ్వీపై కూడా ఆయన విమర్శలు చేశారు.

 

 

‘చిరంజీవి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. చిరంజీవికి ఏం తెలుసని మూడు రాజధానుల బాగుంటుందని చెప్పారో అర్ధం కావటం లేదు. ప్రపంచంలో బహుళ రాజధాని వ్యవస్థ ఫెయిలైన విషయం చిరంజీవికి తెలియదా? పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తే కోట్లలో సంపాదిస్తారు. సినిమాలు వదిలేసి రైతుల కోసం ఎందుకు పోరాడుతున్నాడో చిరంజీవికి తెలియదా?’ అని అశ్వనీదత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్ ఇంటి ఎదుట ధర్నా చేసిన విషయంపై కూడా ఆయన స్పందిస్తూ.. ‘రాజధానిపై మద్దతు కోసం సినీ హీరోలను రైతులు అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్లు సూపర్ స్టార్లుగా ఉన్నారు. నటుడిగా కాకున్నా.. సగటు మనిషిగా స్పందించాల్సిన అవసరం లేదా?’ అని పరోక్షంగా మహేశ్ పై విమర్శలు చేశారు. పృథ్వీ ఓ కమెడియన్. ఆయన మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. పృథ్వీ లాంటి వారి వల్లే జగన్ భ్రష్టు పట్టిపోతున్నారు.. అని కూడా వ్యాఖ్యానించారు.

 

 

చిరంజీవి-అశ్వనీదత్ మధ్య ఎంతో స్నేహం ఉంది. 2004 ఎన్నికల్లో పోటీ చేసిన అశ్వనీదత్ కు చిరంజీవి ప్రత్యక్ష మద్దతు ప్రకటించారు. రాజధాని అంశం వీరిద్దరి మధ్య వైరం తెచ్చేట్టుంది. మహేశ్ తో కూడా హిట్ సినిమాలు తీశారు అశ్వనీదత్. మహేశ్ ను కూడా ఆయన వదలకుండా విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: