జాతీయ మహిళా కమిషన్‌ బృందం గుంటూరుకు చేరుకుంది. రాజధాని తరలింపు నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై మహిళా కమీషన్ బృందం ఆరా తీస్తుంది. రాజధానిని అమరావతిలోని కొనసాగించాలంటూ ఆందోళనకు దిగిన మహిళల పట్ల చోటు చేసుకున్న పరిణామాలపై విచారించేందుకు కమీషన్ రంగంలోకి దిగింది. మహిళలపై పోలీసుల దాడులు, తోపులాటలు వంటి ఘటనలను సుమోటో గా విచారణకు సిద్దపడింది. టిడిపి రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ లిఖిత పూర్వకంగా ఢిల్లీలో ఇటీవల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా ఈ కేసును స్వీకరించింది. ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ ఆ బృందాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇప్పటికే పలు పత్రికలలో వచ్చిన సమాచారాన్ని సేకరించారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో జరిగిన విషయాన్ని స్వయంగా వివరించారు. అమరావతి రాజధాని గ్రామాల్లో ఈ నెల 11న కమిషన్‌ సభ్యులు పర్యటించి మహిళల నుంచి సమాచారాన్ని తెలుసుకుంటారు. రాష్ట్ర డిజిపి గౌతంసవాంగ్‌ను కలిసి మహిళలకు సంబందించి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వారు తీసుకున్న చర్యల గురించి నివేదిక కోరవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో మహిళా కమిషన్‌ను తెదేపా నేతలు పలువురు కలుసుకున్నారు. తెదేపా నేతలు ఆదివారం ఉదయం కేంద్ర మహిళా కమిషన్‌ బృందం సభ్యులను గుంటూరులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కలిశారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, పంచుమర్తి అనురాధ, జేఏసీ నేతలు  మహిళా కమిషన్ సభ్యుల బృందాన్ని కలిసిన వారిలో ఉన్నారు.

రాజధాని ప్రాంతంలో మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై కమిషన్‌ సభ్యులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. గత 26 రోజులుగా పోలీసులు మహిళలపై దాడులు చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని కమిషన్ సభ్యులకు వివరించినట్లు చెప్పారు. అమరావతి రాజధానిని ఇక్కడ నుంచి తరలించవద్దని శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న మ హిళల పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించడం, అసభ్యకరమైన భాష వాడు తుండటం, మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేలా పోలీసులు వ్యవహ రిస్తుండటం, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతుండటాన్ని నిరశిస్తూ పెద్ద ఎత్తున మహిళలు జాతీయ మహిళా కమిషన్‌కు ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదులు చేశారు. అమరావతి ఘటనలపై రాష్ట్ర మహిళా కమిషన్‌ స్పందించకపోయినా దిల్లీ నుంచి కేంద్ర మహిళా కమిషన్‌ స్పందించి అమరావతికి రావడం శుభసూచకమన్నారు.  క్షేత్ర స్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కమిషన్‌ సభ్యులకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: