ప్రముఖ కమెడియన్, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ ఆడియో టేపుల వ్యవహారం వివాదాస్పదం కావడంతో పృథ్వీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలతో పృథ్వీ తీవ్ర మనస్తాపం చెందారు. ఎస్వీబీసీ ఛైర్మన్ హోదాలో ఉన్న పృథ్వీ ఆ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ పార్టీ అధిష్టాన వర్గం నుండి కుడా పృథ్వీకి రాజీనామా చేయాలని సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. 
 
మరికాసేపట్లో పృథ్వీ అధికారికంగా రాజీనామా చేయబోతున్నట్లు మీడియా ముందు ప్రకటన చేయనున్నట్టు సమాచారం. ఈరోజు ఉదయం పృథ్వీ ఒక మహిళతో మాట్లాడిన ఆడియో టేప్ వైరల్ అయిన విషయం తెలిసిందే. సీఐటీయూ వంటి సంస్థలు కూడా ఈ ఆడియో టేప్ విషయంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుండి వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. పృథ్వీ స్పందిస్తూ తను ఎవ్వరితో అసభ్యంగా మాట్లాడలేదని అన్నారు. 
 
ఉద్యోగులు అందరూ తనను అన్న అని పిలుస్తారని పృథ్వీ అన్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఈ విషయం గురించి స్పందించారు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ కొరకు నిజ నిర్ధారణ కమిటీ విచారణకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. టీటీడీ సీవీఎస్‌వోకు విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని ఆదేశాలను జారీ చేశారు. వైవీ సుబ్బారెడ్డి అవసరమైన పక్షంలో సీఎం జగన్ తో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పగా ఈలోపే పృథ్వీ రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
పృథ్వీ తనపై వచ్చిన ఆరోపణల గురించి స్పందిస్తూ ప్రజల ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. రాజధాని రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అని తాను అనలేదని కానీ ఈ విషయంలో తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని అన్నారు. తాను మద్యం తాగినట్టుగా తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని తనపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైసీపీ పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎప్పుడూ వ్యవహరించలేదని అన్నారు. మధ్యాహ్నం మీడియాకు పంపిన వీడియోలో ఈ విషయాలను పృథ్వీరాజ్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: