ఎస్వీబీసీ ఉద్యోగినితో,  సంస్థ చైర్మన్ సినీనటుడు పృథ్వీ రాజ్  అసభ్యంగా మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో సోషల్ మీడియా వైరల్ కావడంతో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలకు ఉపక్రమించింది . పృథ్వీని తన పదవికి రాజీనామా చేయాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది .  ఆడియో టేపు వ్యవహారాన్ని సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఆదేశాల మేరకే టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం .

 

 ఈ వ్యవహారం పై టీటీడీ ఇప్పటికే విజిలెన్స్ విచారణను చేపట్టింది . వాయిస్ శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పూర్తి స్థాయిలో విచారణకు చర్యలు చేపట్టింది .అయితే ఈ విషయమై పృథ్వీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు . ఎస్వీబీసీ సంస్థ ఉద్యోగినితో తాను మాట్లాడినట్లుగా చెబుతున్న వాయిస్ తనది కాదని పేర్కొన్నారు . తన వ్యాఖ్యలపై విజిలెన్స్ విచారణ చేపట్టి తప్పు ఉంటే శిక్షించాలని కోరారు . తనపై లేనిపోని ఆరోపణలు చేసి , కుటుంబం ముందు తలదించుకునే పరిస్థితి తీసుకురావద్దన్నారు . తనపై కక్షతోనే ఈ పని చేశారని , ఈ పని ఎవరు చేశారో ఆ భగవంతునికే తెలియాలని చెప్పారు .  ఇటీవల  రాజధాని రైతుల పట్ల పృథ్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే .

 

రైతుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా పార్టీ పై  విపక్షాలు విమర్శించేందుకు అవకాశం ఇచ్చినట్లయింది భావిస్తోన్న పార్టీ పెద్దలు ,  పృథ్వీ ... ఇప్పుడు మరొక వివాదంలో ఇరుక్కోవడం పట్ల  తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది . రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పై ఇప్పటికే గుర్రుగా ఉన్న పార్టీ నాయకత్వం , ఎస్వీబీసీ ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపు వెలుగు చూడడంతో ఆయన పై వేటు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం . 

మరింత సమాచారం తెలుసుకోండి: