రాజధాని వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకురాబోతోందా..? రాజధాని పేరెత్తకుండానే.. వికేంద్రీకరణ పేరుతో కొత్త చట్టాన్ని రూపొందించే దిశగా జగన్‌ ప్రభుత్వం అడుగులు వేయబోతోందా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇలాగే కనిపిస్తోంది. రాజధాని తరలింపు.. ఈ నెల 20న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టి సీఆర్ డీఏ చట్టాన్ని రద్దు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. 

 

రాజధాని వికేంద్రీకరణ -మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో సర్కార్‌ వడి వడిగా అడుగులు వేస్తోంది. న్యాయపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నెల 18న కెబినెట్‌ సమావేశం.. ఆ తర్వాత 20 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా.. రెండు ఒకే రోజు జరిపితే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది ప్రభుత్వం. అందుకే 20న ఉదయం తొమ్మిదిన్నరకు కేబినెట్ సమావేశం నిర్వహించి హైపవర్ కమిటీ నివేదికను ముందుగా ఆమోదిస్తారు. 11.30కు అసెంబ్లీ భేటీ జరుగుతుంది.

 

రాజధానితో పాటు అభివృద్ధి-పాలనా వికేంద్రీకరణ విషయంలో చట్టపరంగానే ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తరలింపు విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రత్యేక చట్టాలు చేయాల్సిందేనన్న ఆలోచనలో జగన్‌ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రాజధాని విభజన విషయంలోనూ.. అలాగే వికేంద్రీకరణ విషయంలోనూ కొత్త చట్టాన్ని తెచ్చే దిశగా కసరత్తు చేస్తున్నారు. రాజధాని పేరు లేకుండా కొత్త చట్టం రూపొందించేంచే పనిలో ఉంది ప్రభుత్వం...ఏపీ డీసెంట్రలైజేషన్‌ అండ్ ఈక్వల్ డెవలప్‌మెంట్‌ ఆఫ్ ఆల్ రిజీయన్స్‌ బిల్‌-2020 పేరుతో కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్‌ బిల్లును అధికారులు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. 

 

ఏపీలో ఉన్న మూడు ప్రాంతాలనూ వివిధ జోన్ లుగా ఏర్పాటు చేసే దిశగా కొత్త బిల్లును రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి జోనుకూ ప్రత్యేకంగా తొమ్మిది మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తారు. ప్రతి బోర్డుకూ ఛైర్మనుగా సీఎం వ్యవహరిస్తారు. అలాగే వైస్ ఛైర్మన్‌ ఉంటారు. ప్రాంతీయ బోర్డుల్లో సభ్యులుగా ఒక ఎంపీ, ఇద్దురు ఎమ్మెల్యేలు, మరో నలుగురు ప్రతినిధులు ఉండేలా బిల్లును సిద్దం చేస్తున్నట్టు సమాచారం. సదురు ప్రాంతీయ  బోర్డు కార్యదర్శిగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏయే జోన్ లలో ఏయే ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి..? ఎక్కడ ఏర్పాటు చేయాలి..? అనే అంశాలను కూడా బిల్లులో పెట్టొచ్చు. కర్ణాటక మోడల్ తరహాలో దీన్ని రూపొందిస్తున్నారు. జీఎన్‌ రావు కమిటీ నివేదికతో పాటు.. బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ నివేదిక కూడా దాదాపు ఇలాంటి సూచనలే చేశాయి. కొత్త చట్టాన్ని తీసుకురావడంతోపాటు.. ఇప్పటికే ఉన్న సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కూడా సర్కార్‌ నిర్ణయం తీసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. ఓవైపు సీఆర్డీఏను రద్దు చేస్తూనే.. మరోవైపు సీఆర్డీఏ పరిధిలోని ప్రాంతాలను.. వివిధ అర్బన్‌ డెవలప్మెంట్‌ అథార్టీల్లో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు అధికారులు సీఆర్డీఏ రద్దుకు రంగం సిద్దం చేస్తున్నట్టు సమాచారం. అయితే సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తే ఉత్పన్నం అయ్యే సమస్యలను ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందో చూడాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: