ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీల పొత్తు గురించి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జనసేన పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లోను, సార్వత్రిక ఎన్నికల్లోను కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ, జనసేన పార్టీలు గత ఎన్నికల్లో వారికి వచ్చిన ఓట్లు, సీట్ల శాతాన్ని పరిశీలన చేస్తే బీజేపీ, జనసేన పెద్దగా ప్రభావం చూపే రాజకీయపార్టీలుగా గత ఎన్నికల్లో గుర్తింపు పొందలేదని అంబటి అన్నారు. 
 
ఇరు పార్టీల కలయికపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని కానీ ఇరు పార్టీలు వైసీపీపై ప్రెస్ కాన్ఫరెన్స్ లో విమర్శలు చేశారని అంబటి అన్నారు. ఏడు మాసాల వైసీపీ పాలనపై విమర్శలు చేసినప్పుడు స్పందించాలని స్పందిస్తున్నామని అన్నారు. రాజకీయాల్లో స్థిరత్వం లేని వ్యక్తి, వ్యక్తిగతంగా కూడా స్థిరత్వం లేని వ్యక్తి ఒక పార్టీ నడుపుతున్నారని పవన్ ను ఉద్దేశించి అన్నారు. 
 
సుందరయ్య విజ్ఞాన భవన్ లో కూర్చుని ఆయన పుస్తకం చదువుతుంటే కమ్యూనిస్టుల సిద్ధాంతం ఈ మానవాళిను బాగు చేసేదిగా అనిపిస్తుందని ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ లో కూర్చుని పుస్తకాలు చదువుతుంటే చంద్రబాబు గొప్ప మేధావి, లోకేష్ అంత తెలివిగలవారు లేరని అనిపిస్తుందని శ్యాం ప్రసాద్ ముఖర్జీ లైబ్రరీలో కూర్చుని చదివితే ప్రధాని మోదీ కంటే గొప్పవారు ఎవరూ లేరని అనిపిస్తుందని పవన్ ను ఉద్దేశించి అంబటి వ్యాఖ్యలు చేశారు. 
 
ఒక్కో లైబ్రరీలో కూర్చుంటే ఒక్కొక్కటి కనిపిస్తోందని మరి రేపు ఏ లైబ్రరీలో కూర్చుంటారో ఏ పుస్తకం చదువుతారో అని అన్నారు. మరి వారికి రేపు ఏమని అనిపిస్తోందో ఇలా రాజకీయ స్థిరత్వం లేని వ్యక్తిని బీజేపీ నమ్ముకొని కుక్కతోక పట్టుకుని ఈదుతానంటే ఎవరికీ అభ్యంతరం లేదని అంబటి అన్నారు. పవన్ మోదీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని మోదీపై పవన్ ధ్వజమెత్తారని ఈరోజు బీజేపీ పవన్ కు ప్రత్యేకమైన లడ్డూలు పంపించిందా అని అంబటి ప్రశ్నించారు. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: