తెలుగు దేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనలకు సభలో అడ్డం పడేందుకు వ్యూహాలు సిద్దం చేస్తుంది. మండలిలో బలంగా ఉన్న తెలుగుదేశం దాన్ని అవకాశంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తోంది. సమావేశాలపై ఇప్పటికే విప్ జారీ చేసిన టీడీపీ రేపు శాసన సభా పక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంది.

 

అమరావతి తరలింపు వ్యవహారం కీలక దశకు చేరుకుంది. 20, 21 తేదీల్లో అసెంబ్లీ సమావేశాల ద్వారా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెలువరించనుంది. ఇప్పటికే హైపవర్ కమిటీ నివేదిక పై కూడా ప్రభుత్వం చర్చించింది. దీంతో ఈ సభలో సీఆర్ డీఏ చట్టాన్ని రద్దు చేయడం లేదా సవరించడం చేస్తారని ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు పాలన వికేంద్రీకరణపై కొత్త చట్టాన్ని తేనున్నారని సమాచారం. క్యాబినెట్ ఆమోదం తరువాత సభకు వచ్చే బిల్లుపై ఎలా ప్రతిపక్షం దృష్టిపెట్టింది. చట్టసభల్లో ప్రభుత్వ ప్రతిదనలను ఎంతవరకు అడ్డుకోవచ్చు అనే అంశంపై విస్తృతంగా చర్చిస్తోంది.

 

శాసన సభలో తెలుగు దేశం పార్టీ ఏ బిల్లును కూడా అడ్డుకోలేదు. 151 మందితో బలంగా ఉన్న అధికార పార్టీ బిల్ లను సులభంగానే పాస్ చేసుకుంది. అయితే మండలిలో అతిపెద్ద పార్టీగా టీడీపీనే ఉంది. మొత్తం 55 మంది ఎమ్మెల్సీలలో 35 మంది టీడీపీ సభ్యులే ఉన్నారు. దీంతో మండలిలో రాజధానిపై బిల్ తీసుకు వస్తే దాన్ని అడ్డుకునే అవకాశం టీడీపీకి ఉంటుంది. తన కున్న సంఖ్యా బలం దృష్ట్యా బిల్ ను తిప్పి పంపడం, లేదా సవరణలు ఇవ్వడం చేసే అవకాశం ప్రతిపక్ష టీడీపీకి ఉంది. అయితే నాన్ ఫైనాన్స్ బిల్లుల విషయంలో మాత్రమే ప్రతిపక్షానికి ఈ సౌలభ్యం ఉంది. ఒక వేళ సభలో ఫైనాన్స్ బిల్ పెడితే దాన్ని తిరస్కరించే అధికారం మండలికి ఉండదు. దీంతో ప్రభుత్వం కొత్తగా తెచ్చే బిల్ ఏ రూపంలో తెస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఒక వేళ కొత్త బిల్ ఫైనాన్స్ బిల్ అయితే దాన్ని ప్రతిపక్షం నిలువరించలేదు. ఒక వేళ సాధారణ బిల్ అయితే దానిపై సుదీర్ఘంగా చర్చకు పట్టుపట్టవచ్చు, సవరణలు సూచించవచ్చు. తద్వారా కొన్ని రోజుల పాటు జాప్యం చేయవచ్చు. ఇదే సమయంలో బిల్ ను సెలక్ట్ కమిటీ కి పంపే అవకాశం కూడా ఉంటుంది. అదే జరిగితే బిల్ నెలల తరబడి మూలన పడుతుంది. ప్రభుత్వం అసలు ఏం చేయబోతుంది అనే అంశంపై దృష్టిపెట్టిన టీడీపీ... దానికి అనుగుణంగా కౌంటర్ ప్లాన్ లు సిద్దం చేస్తుంది. 

 

అసెంబ్లీ సమావేశాల తరుణంలో టీడీఎల్ పి సభ్యులకు విప్ జారీ చేసింది. రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి కూడా విప్ పరిధిలోకి వస్తారని టీడీపీ చెబుతోంది. సభలో ప్రభుత్వ బిల్ ను టీడీపీ వ్యతిరేకిస్తే.....ఈ ఇద్దరు సభ్యులుకూడా దానికి అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక వేళ సభకు గైర్హాజరు అయినా....విప్ ను ధిక్కరించినా వీరిపై ఫిర్యాదు చేసే అవకాశం టీడీపీకి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: