ఏపీ శాసనమండలికి మూడు రాజధానుల బిల్లు చేరిన వేళ టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. మండలిలో మెజారిటీ ఉండటం వల్ల ఎలాగోలా బిల్లుని అడ్డుకుందామని టీడీపీ భావించిన తరుణంలోనే డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం టీడీపీకి భారీ షాక్ తగిలనట్లైంది. అయితే డొక్కా రాజీనామా లేఖలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్న, ఆయన వెనుక వైసీపీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. మండలిలో ఎలా అయిన బిల్లు పాస్ చేయించుకునే ఉద్దేశంలోనే వైసీపీ గేమ్ ప్లాన్ వేసినట్లు కనబడుతుంది.

 

అందులో భాగంగానే డొక్కా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి డొక్కా టీడీపీపై అసంతృప్తిగానే ఉన్నారు. డొక్కా ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి మేకతోటి సుచరితపైన దాదాపు 4600 ఓట్ల మెజారిటీ తేడాతో ఓడిపోయారు. అయితే ఇంత స్వల్ప తేడాతో ఓడిపోవడానికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబమే కారణమని డొక్కా అసంతృప్తితో ఉన్నారు.

 

ఎన్నికల సమయంలో గ‌ల్లా జ‌య‌దేవ్‌తో పాటు ఆయ‌న త‌ల్లి అరుణ‌కుమారి ఎంపీ ఓటు మాకు...ఎమ్మెల్యే ఓటు మీ ఇష్టం అని ప్ర‌చారం చేశారు. అందుకే అక్క‌డ జ‌య‌దేవ్‌కు ఎక్క‌వ ఓట్లు వ‌చ్చాయి. డొక్కా స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక దీనిపై బాబుకు చెప్పినా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో డొక్కా మ‌న‌స్థాపం చెంది ఉన్నారు. పైగా ఆయన సొంత నియోజకవర్గం తాడికొండ సీటు కూడా ఇవ్వలేదు.

 

డొక్కా కాంగ్రెస్ లో ఉండగా తాడికొండ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతోనే ఆయన ఆ సీటు కావాలని ఎప్పటి నుంచో టీడీపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇక డొక్కా వినతులని టీడీపీ అధిష్టానం పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఎంతో కాలంగా అసంతృప్తిగా ఉన్న డొక్కా...ఇప్పుడు ముఖ్యమైన సమయంలో టీడీపీకి ఝలక్ ఇచ్చారు. మొత్తానికి డొక్కా టీడీపీ వీడటానికి గల్లా కుటుంబం ఎఫెక్ట్ గట్టిగానే ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: